Emotion AI : వన్ మినిట్ లో మనసును చదివేసే ‘ఎమోషన్ ఏఐ’..! వెబ్‌క్యామ్ స్కాన్‌తో మానసిక స్థితి గుర్తింపు.. 98శాతం ఖచ్చితత్వం..!
సాక్షి లైఫ్ : మనసులో ఏదైనా బాధ ఉన్నా, తీవ్రమైన ఒత్తిడి వేధిస్తున్నా పైకి నవ్వుతూ దాచేసే రోజులిక చెల్లవు. మీ ముఖ కవళికలను బట్టి మనసులోని లోతులను ఇట్టే పసిగట్టేసే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం మహర్షి భరతముని తన నాట్యశాస్త్రంలో ప్రతిపాదించిన ‘నవరస’ సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకుని, పూణేకు చెందిన ‘నిహిలెంట్’ (Nihilent) అనే ఐటీ సంస్థ ‘ఎమోస్కేప్’ పేరిట ఒక అద్భుతమైన మెడికల్ గ్రేడ్ ఎమోషన్ ఏఐ (Emotion AI) ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది.
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం.. ఈ తొమ్మిది రసాలే మానవ భావోద్వేగాలకు మూలస్తంభాలు. ‘ఎమోస్కేప్’ సాంకేతికత పూర్తిగా ఈ సిద్ధాంతం పైనే పనిచేస్తుంది. వినియోగదారులు కేవలం ఒక వెబ్‌క్యామ్ ముందు ఒక నిమిషం పాటు కూర్చుంటే సరిపోతుంది.
శరీరానికి ఎలాంటి సెన్సార్లు అమర్చాల్సిన అవసరం లేదు. ఈ ఏఐ వ్యవస్థ కేవలం 60 సెకన్లలో ముఖ కండరాల కదలికలు, కనురెప్పల వేగం, పెదవుల వణుకు, మెడ, భుజాల సూక్ష్మ మార్పులను నిశితంగా స్కాన్ చేస్తుంది. సేకరించిన డేటాను అధునాతన అల్గారిథమ్‌ల ద్వారా విశ్లేషించి, ఆ క్షణంలో సదరు వ్యక్తి మనసులో ఏ రసం బలంగా ఉందో, మానసిక స్థితి స్థిరంగా ఉందో లేదో కచ్చితంగా వెల్లడిస్తుంది.
ఈ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘నిమ్హాన్స్’ (NIMHANS), మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) నిపుణుల సహకారంతో వైద్యాధికారికంగా అభివృద్ధి చేశారు. 3 సంవత్సరాల పిల్లల నుండి 75 ఏళ్ల వృద్ధుల వరకు సుమారు 1,000 కి పైగా క్లినికల్ స్కాన్‌లను నిర్వహించగా, ఈ వ్యవస్థ 98 శాతం ఖచ్చితత్వాన్ని కనబరిచిందని సంస్థ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎల్.సి. సింగ్ అంటున్నారు.
ఎమోస్కేప్ అందించే పారదర్శకమైన డేటా వల్ల వైద్యులకు రోగుల మానసిక స్థితిని కచ్చితంగా అంచనా వేయడం, సరైన చికిత్స అందించడం సులువవుతుందని IHBAS, ఢిల్లీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ నిమేష్ జి. దేశాయ్ చెబుతున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా నగరాల్లోని యువతలో ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression) తీవ్రంగా పెరుగుతున్నాయి. మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. అయితే, అవగాహన లేకపోవడం వల్ల 80 శాతానికి పైగా ప్రజలు సకాలంలో చికిత్స పొందలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఎమోస్కేప్ వంటి సాంకేతికత ప్రాథమిక దశలోనే మానసిక ఒత్తిడిని గుర్తించడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ అందుబాటులో ఉంది..?
పూణేలోని జహంగీర్ వెల్నెస్ సెంటర్ వంటి ప్రముఖ వైద్య సంస్థల్లో ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఏప్రిల్ 2026 లో ‘ఎన్సెపియా బీటా’ (Ensepia Beta) పేరిట దీని ప్రైవేట్ వెర్షన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇది సాధారణ ప్రజలకు నేరుగా అందుబాటులో లేనప్పటికీ.. ఆసుపత్రులు, కార్పొరేట్ సంస్థలు, పరిశోధనా కేంద్రాలలో విస్తృతంగా వినియోగంలోకి వస్తోంది. త్వరలోనే ఇది పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు రానుంది. సాంకేతికత ఎంతగా సహాయపడినప్పటికీ.. మానసిక సమస్యల నివారణకు భావోద్వేగాల పట్ల సొంత అవగాహన, తోటివారితో మనసు విప్పి మాట్లాడటమే అత్యుత్తమ మార్గాలని ఈ వేదిక గుర్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
