Healthy Gut, Healthy Brain : ఆరోగ్యకరమైన జీర్ణాశయం.. 'బ్రెయిన్-గట్ హెల్త్ ' లంకె వెనుక అసలు రహస్యం ఇదే..!
సాక్షి లైఫ్ : ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడో లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడో.. కడుపులో ఏదో తెలియని వికారం, తిప్పినట్లు అనిపించడం చాలా మందికి అనుభవమే. అలాగే ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు కడుపులో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మనం సాధారణంగా దీనిని యాదృచ్ఛికంగా భావిస్తాం. కానీ, దీని వెనుక ఒక బలమైన సైన్స్ ఉంది. మన మెదడుకు, గట్ హెల్త్ కు మధ్య విడదీయరాని సంబంధం ఉందని, దీనినే వైద్య పరిభాషలో ‘బ్రెయిన్-గట్ యాక్సిస్’ అంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే, మన కడుపు ఆరోగ్యంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. మనస్సు ఆందోళనగా ఉంటే కడుపు అల్లకల్లోలమ వుతుంది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
మానసిక స్థితిని మార్చే 'గట్ మైక్రోబయోమ్'..
మన పేగులలో లక్షల కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. దీనిని ‘గట్ మైక్రోబయోమ్’అంటారు. ఇవి కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడానికే కాదు.. మన మానసిక స్థితిని నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చే సెరోటోనిన్, డోపమైన్, గాబా (GABA) వంటి రసాయనాలను (న్యూరోట్రాన్స్మిటర్లు) ఈ పేగుల్లోని బ్యాక్టీరియా విడుదల చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే 'సెరోటోనిన్' హార్మోన్లలో అత్యధిక భాగం పేగుల్లోనే తయారవుతుంది.
పేగుల్లోని ఈ మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటే అది నేరుగా మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా డిప్రెషన్, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా, మనం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు.. అది గట్ మైక్రోబయోమ్‌ను దెబ్బతీసి కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలకు కారణమవుతుంది.
వేగస్ నాడి.. సమాచార వారధి..!
మన మెదడుకు, జీర్ణవ్యవస్థకు మధ్య ‘వేగస్ నాడి’ (Vagus Nerve) ఒక హైవేలా పనిచేస్తుంది. ఇది పేగులను, మెదడును నేరుగా అనుసంధానిస్తుంది. పేగుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడితే.. ఈ నాడి ద్వారా ఆ సంకేతాలు వెంటనే మెదడుకు చేరుతాయి. ఇది మానసిక స్థితిలో మార్పులు, నిద్రలేమి, తీవ్రమైన ఆందోళనకు దారితీస్తుంది. శరీరంలో వచ్చే ఇటువంటి దీర్ఘకాలిక వాపులు భవిష్యత్తులో అల్జీమర్స్, డిప్రెషన్ వంటి తీవ్ర మానసిక రుగ్మతలకు కూడా దారితీయవచ్చని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
జీర్ణాశయం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
జీర్ణవ్యవస్థను పటిష్టం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం రోజువారీ ఆహారంలో ఈ క్రింది వాటిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా..పులియబెట్టిన ఆహార పదార్థాలైన పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోస, కిమ్చి వంటి వాటిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి.
ప్రీబయోటిక్స్.. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడతాయి. అరటిపండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఓట్స్, ఆపిల్స్ వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రీబయోటిక్స్‌గా అద్భుతంగా పనిచేస్తాయి.
ఫైబర్..ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. అవిసె గింజలు (Flax seeds), వాల్‌నట్స్, చేపలు మెదడు చురుకుదనానికి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
శరీరంలో నీటి కొరత ఏర్పడితే మలబద్ధకం, పేగుల్లో వాపు సమస్యలు వస్తాయి. కాబట్టి రోజుకు సరిపడా నీరు తాగడం ఉత్తమం. కడుపులో తరచూ ఇన్ఫెక్షన్లు రావడం లేదా మానసిక ఒత్తిడి కారణంగా జీర్ణక్రియ దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తే.. కేవలం తాత్కాలిక మందులతో సరిపెట్టకుండా, నిపుణులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా సైకాలజిస్ట్‌ను సంప్రదించి సరైన మూల కారణాన్ని గుర్తించడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
