Dog bite : కుక్క కరిచినప్పుడు పసుపు, సున్నం రాస్తున్నారా..? అది ఎంత ప్రమాదమో తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన దేశంలో ఇప్పటికీ కుక్క కరిచిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా.. గాయంపై పసుపు, సున్నం, కారం, పేడ లేదా వేప ఆకులు వంటివి రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల విషం బయటకు వచ్చేస్తుందని నమ్ముతారు. కానీ, ఇలాంటి చిట్కాలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచినప్పుడు రేబిస్ వైరస్ నరాల ద్వారా నేరుగా మెదడుకు చేరుకుంటుంది. ఒక్కసారి రేబిస్ లక్షణాలు బయటపడితే ఇక ప్రాణాలు దక్కవు. కాబట్టి కుక్క కరిచినప్పుడు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి..ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న 'ప్రపంచ రేబిస్ దినోత్సవం' నిర్వహిస్తారు. రేబిస్ (Rabies) వంటి ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

 

ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..

పసుపు, సున్నం, కారం పూయద్దు: కుక్క కరిచిన గాయంపై పసుపు, సున్నం, కారం, నూనె, పేడ లేదా మట్టి లాంటివి అస్సలు రాయకూడదు. వీటివల్ల గాయం మరింత పెద్దదై, చర్మ కణజాలం దెబ్బతింటుంది. ఇతర ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ లేపనాల వల్ల రేబిస్ వైరస్ ఏమాత్రం చనిపోదు.

కట్లు కట్టొద్దు, కుట్లు వేయొద్దు..

 గాయం తీవ్రతను చూసి కంగారుపడిపోయి గట్టిగా కట్టు కట్టడం లేదా వెంటనే కుట్లు వేయించే ప్రయత్నం చేయకూడదు. ముఖంపై లేదా సున్నితమైన భాగాల్లో గాయాలైనప్పుడు, ఆ గాయం లోతును బట్టి కుట్లు వేయాలా వద్దా అనేది డాక్టర్లు మాత్రమే నిర్ణయిస్తారు. మంత్రాలు, తాయత్తులు, నాటు వైద్యం అంటూ సమయం వృథా చేయకూడదు. దీనివల్ల వ్యాక్సిన్ తీసుకోవడంలో ఆలస్యం జరిగి వైరస్ మెదడుకు వ్యాపించే ప్రమాదం ఉంది.

కుక్క కరిస్తే వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స..

సబ్బు, నీళ్లతో కడగాలి: కుక్క లేదా మరేదైనా జంతువు కరిచిన వెంటనే కనీసం 15 నిమిషాల పాటు గాయాన్ని సబ్బుతో, ధారగా పడుతున్న శుభ్రమైన నీటి (Running water) కింద బాగా కడగాలి. రేబిస్ వైరస్ బారినుంచి కాపాడుకోవడానికి, వైరస్ తీవ్రతను తగ్గించడానికి ఇంట్లో చేయాల్సిన అత్యంత కీలకమైన మొదటి అడుగు ఇదే.

యాంటీసెప్టిక్ ..

 సబ్బు నీటితో శుభ్రం చేసిన తర్వాత ఆ గాయంపై పోవిడోన్-అయోడిన్ (Povidone-Iodine) వంటి యాంటీసెప్టిక్ లోషన్ మాత్రమే రాయాలి. ఆలస్యం చేయకుండా డాక్టర్ వద్దకు: ప్రథమ చికిత్స పూర్తయిన వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలి. వారు గాయాన్ని బట్టి యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ (ARV) ఎన్ని డోసులు వేయాలి, అలాగే టిటానస్ (TT ఇంజెక్షన్ లేదా యాంటీబయాటిక్స్ అవసరమా అనేది నిర్ణయించి సరైన చికిత్స అందిస్తారు. కుక్క కరిచినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ప్రాణాల మీదకు వస్తుంది. ఇంట్లోని చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే 'యాంటీ రేబిస్ వ్యాక్సిన్' తీసుకోవడమే దీన్నుంచి బయటపడే ఏకైక రక్షణ మార్గం.

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.