High BP and Diabetes : షుగర్, బీపీ బాధితులు నవరాత్రి ఉపవాసాలు చేయవచ్చా..? నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివే..!
సాక్షి లైఫ్ : శరన్నవరాత్రుల వేళ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దుర్గామాత అనుగ్రహం కోసం భక్తులు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. అయితే, జీవనశైలి వ్యాధులైన మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension)తో బాధపడేవారు ఉపవాసాలు ఉండవచ్చా..? దీక్షల సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలగురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఏమీ తినకుండా ఉండటం వల్ల..
ఆరోగ్యవంతులు నిరభ్యంతరంగా ఉపవాసాలు చేయగలిగినప్పటికీ, దీర్ఘకాలిక సమస్యలున్నవారికి ఆహార వేళల్లో మార్పులు, మందుల సమయాలు తప్పడం పెను సవాలుగా మారుతుంది. ముఖ్యంగా సుదీర్ఘ సమయం పాటు ఏమీ తినకుండా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం లేదా పెరగడం, శరీరంలో నీటిశాతం తగ్గి బీపీలో హెచ్చుతగ్గులు రావడం జరగవచ్చు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఉపవాసానికి ముందు, సమయంలో తప్పనిసరి జాగ్రత్తలు..
వైద్యుల అనుమతి తప్పనిసరి: ఇన్సులిన్ లేదా రోజూ మాత్రలు తీసుకునే మధుమేహ రోగులు, రక్తపోటు బాధితులు సొంత నిర్ణయాలతో ఉపవాసం ఉండకూడదు. వైద్యులను సంప్రదించి మందుల మోతాదు, సమయాలను సర్దుబాటు చేసుకోవాలి.నిర్జల ఉపవాసాలు వద్దు..మధుమేహం, బీపీ ఉన్నవారు నీరు కూడా తాగని కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. శరీరంలో తగినంత ద్రవాలు లేకపోతే డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంది. నిరంతర పర్యవేక్షణ..రోజులో క్రమం తప్పకుండా గ్లూకోమీటర్తో షుగర్ లెవల్స్, బీపీని పరీక్షించుకోవాలి.
హెచ్చరిక సంకేతాలు గమనించండి..
వణుకు, విపరీతమైన చెమటలు, కళ్లు తిరగడం, గుండె దడ వంటివి కనిపిస్తే అది లో-షుగర్ (Hypoglycemia) లక్షణం కావచ్చు. షుగర్ లెవల్ 70 mg/dL కంటే తగ్గితే వెంటనే తేనె లేదా గ్లూకోజ్ తీసుకోవాలి. అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన, విపరీతమైన నీరసం ఉంటే షుగర్ పెరిగిందని గ్రహించాలి.
ఆహార నియమాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
వేపుళ్లు, అధిక కార్బోహైడ్రేట్లకు దూరం: ఉపవాస వేళల్లో ఆలుగడ్డలు, సగ్గుబియ్యం కిచిడీ, నూనెలో వేయించిన పూరీలు, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అకస్మాత్తుగా పెంచుతాయి. పండ్ల రసాలు కాకుండా నేరుగా పండ్ల ముక్కలనే మితంగా తీసుకోవాలి. తీపి లేని పెరుగు, తక్కువ మోతాదులో డ్రైఫ్రూట్స్ ఎంచుకోవచ్చు. ఉపవాసంలో సాధారణంగా వాడే సైంధవ లవణంలోనూ (Rack salt) సోడియం ఉంటుంది. కాబట్టి బీపీ బాధితులు ఉప్పును అతిగా వాడకూడదు.
సమతుల్య ఆహారం..
ఉపవాసం విరమించే సమయంలో ఒకేసారి భారీగా కాకుండా తేలికగా జీర్ణమయ్యే సమతుల్య ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉపవాస సమయంలో విపరీతమైన నీరసం, తలతిరగడం లేదా స్పృహ తప్పే పరిస్థితులు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీక్షను విరమించి వైద్యసాయం పొందడం అత్యవసరం.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
