Medicines : ఖాళీ కడుపుతో కొన్ని.. భోజనం తర్వాత మరికొన్ని..మందులు వేసుకునే వేళల వెనుక సీక్రెట్ ఇదే..!
సాక్షి లైఫ్ : ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే ప్రిస్క్రిప్షన్‌లో మందులతో పాటు వాటిని ఎప్పుడు వేసుకోవాలో రాసిస్తుంటారు. కొన్ని మాత్రలను ఉదయాన్నే పరగడుపున వేసుకోమని సూచిస్తే, మరికొన్నింటిని టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాతే మింగాలని చెబుతారు. అంతిమంగా మందులు కడుపులోకి చేరడమే కదా, ఎప్పుడు వేసుకుంటే ఏమవుతుందిలే అని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ మందు వేసుకునే వేళకు, అది శరీరంలో పనిచేసే విధానానికి విడదీయరాని సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఖాళీ కడుపున ఎందుకు వేసుకోవాలి..?
శరీరంలోకి వెళ్లిన ఔషధం రక్తంలో సరిగ్గా కలిసి పనిచేయడాన్ని ‘అబ్సార్ప్షన్’ (absorption) అంటారు. కొన్ని రకాల మందులు జీర్ణాశయంలో ఆహారం ఉన్నప్పుడు రక్తంలోకి సరిగ్గా చేరలేవు.
ఔషధ సామర్థ్యం తగ్గకుండా..
ఆహారం లేదా పానీయాలు ఉన్నప్పుడు కొన్ని మందుల శోషణ మందగిస్తుంది. ఫలితంగా ఔషధం పూర్తిస్థాయిలో రక్తంలోకి చేరక, వ్యాధిపై సమర్థంగా పనిచేయదు. అందుకే వీటిని ఖాళీ కడుపుతో ఆహారానికి కనీసం గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత వేసుకోవాలని సూచిస్తారు.
థైరాయిడ్, గ్యాస్ మందులు..
ఉదాహరణకు థైరాయిడ్ సమస్యకు వాడే ‘లెవోథైరాక్సిన్’ మాత్రను ఉదయం లేవగానే ఖాళీ కడుపుతోనే తీసుకోవాలి. దీనితో పాటు టీ, కాఫీ లేదా ఆహారం తీసుకున్నా, కాల్షియం-ఐరన్ మాత్రలు కలిపి వేసుకున్నా దాని శోషణ దెబ్బతింటుంది. అలాగే ఎసిడిటీకి ఇచ్చే ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటర్లు ,పాంటోప్రజోల్, ఒమెప్రజోల్ వంటివి కూడా యాసిడ్ ఉత్పత్తిని అడ్డుకోవడానికి ఖాళీ కడుపుతోనే బాగా పనిచేస్తాయి.
భోజనం తర్వాతే ఎందుకు తీసుకోవాలి..?
మరికొన్ని రకాల మందులను ఖాళీ కడుపుతో తీసుకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. అందుకే వాటిని భోజనంతో పాటో లేదా తిన్న వెంటనే తీసుకోవాలని సూచిస్తారు.
కడుపులో మంట, అల్సర్ల నివారణ..
నొప్పి నివారణకు వాడే నాన్‌స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఐబూప్రోఫెన్, డైక్లోఫెనాక్ వంటి పెయిన్ కిల్లర్లు జీర్ణాశయ లోపలి పొరను చికాకు పెడతాయి. ఖాళీ కడుపుతో వేసుకుంటే వికారం, తీవ్రమైన కడుపుమంటతో పాటు దీర్ఘకాలంలో కడుపులో పుండ్లు (ulcers) వచ్చే ప్రమాదం ఉంది. భోజనం ఈ మందుల ప్రభావాన్ని తగ్గించి కడుపు గోడలను రక్షిస్తుంది.
కొవ్వులో కరిగే విటమిన్లు..
విటమిన్-డి, విటమిన్-ఇ, ఒమేగా-3 వంటి కొన్ని సప్లిమెంట్లు కొవ్వు పదార్థాలతో కలిసినప్పుడే శరీరానికి పూర్తిగా అందుతాయి. కాబట్టి వీటిని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల గరిష్ట ఫలితం దక్కుతుంది.
యాంటీబయాటిక్స్,పాల ఉత్పత్తుల నియమం..
కొన్ని యాంటీబయాటిక్స్ వికారాన్ని కలిగిస్తాయి కాబట్టి తేలికపాటి ఆహారంతో తీసుకోవాలి. అయితే టెట్రాసైక్లిన్, సిప్రోఫ్లోక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను పాలతో కలిపి తీసుకోకూడదు, పాలలోని కాల్షియం ఆ మందు పనితీరును నిర్వీర్యం చేస్తుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
మందులు వేసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..
ప్రిస్క్రిప్షన్ పాటించండి.. వైద్యుడు లేదా ఫార్మాసిస్ట్ రాసిన సూచనలను తప్పకుండా గమనించాలి. సందేహాలుంటే ముందే అడిగి నివృత్తి చేసుకోవాలి. మంచినీటితోనే మింగండి.. వైద్యులు ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, మందులను ఎల్లప్పుడూ సాధారణ మంచినీటితోనే మింగాలి. పండ్ల రసాలు, సోడాలు, టీ, కాఫీలతో మందులు వేసుకోకూడదు.
సొంత నిర్ణయాలు వద్దు..ఒకవేళ వేసుకోవాల్సిన సమయానికి మాత్ర మర్చిపోతే, తర్వాతి పూట రెండు మాత్రలు ఒకేసారి వేసుకోకూడదు. అసౌకర్యం కలిగితే.. ఏదైనా మందు వేసుకున్నాక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, దద్దుర్లు వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి. మందు సరిగ్గా పనిచేసి వ్యాధి త్వరగా నయం కావాలంటే డోసు ఎంత ముఖ్యమో..దాన్ని వేసుకునే సమయమూ అంతే ముఖ్యం.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
