Essential Minerals : శరీరంలో ఈ ఖనిజాలు లోపిస్తే.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తప్పవు..!
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మాత్రమే సరిపోవు; మన కంటికి కనిపించని విటమిన్లు, ఖనిజాలు కూడా అత్యవసరం. ముఖ్యంగా ఇనుము (Iron), అయోడిన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనే ఐదు ఖనిజాలు శరీర విధులు సక్రమంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన ఆహారంలో ఇవి లోపిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇనుము (Iron).. జీవక్రియకు ఆధారం..
మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము కీలకం. ఇది డిఎన్ఏ నిర్మాణం, రోగనిరోధక శక్తి పెంపులోనూ సహాయపడుతుంది. గొడ్డు మాంసం, చికెన్, చేపలు, గుడ్లు వంటి జంతు సంబంధిత ఆహారంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. శాకాహారులు కందిపప్పు, బఠానీలు, సోయా, బీన్స్, బ్రోకలీ, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాల ద్వారా దీనిని పొందవచ్చు. మొక్కల ద్వారా లభించే ఇనుము శరీరానికి త్వరగా అందదు. అందుకే ఇనుము అధికంగా ఉండే ఆహారంతో పాటు విటమిన్-సి ఉన్న నిమ్మ, టమోటా, స్ట్రాబెర్రీ, కివి వంటి పండ్లను కలిపి తీసుకోవాలి.
రక్తహీనతతో పొంచి ఉన్న ముప్పు..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేధిస్తున్న సమస్య రక్తహీనత (Anemia). శరీరంలో తగినంత ఇనుము లేకపోతే అలసట, చలిగా అనిపించడం, జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో దీనివల్ల పెరుగుదల మందగించడం, ప్రవర్తనా సమస్యలు, మేధో వికాసం కుంటుపడే అవకాశం ఉంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, శాకాహారుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అయోడిన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి నాలు ఖనిజాలు మన శరీరానికి చాలా ప్రధానం.
అయోడిన్..
థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం. లోపిస్తే థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
కాల్షియం..
ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి కాల్షియం తోడ్పడుతుంది. దీని శోషణ సక్రమంగా జరగాలంటే విటమిన్-డి కూడా అవసరం.
పొటాషియం & మెగ్నీషియం..
గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, కండరాల కదలికలకు ఇవి ఎంతో ముఖ్యం. కూరగాయలను వండేటప్పుడు పొటాషియం నీటిలోకి వెళ్తుంది, కాబట్టి వంట పద్ధతుల్లో జాగ్రత్త వహించాలి.
శోషణను అడ్డుకునే అంశాలు-జాగ్రత్తలు..!
మనం మంచి ఆహారం తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు శరీరానికి పోషకాలు అందవు. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాన్ని, ఇనుము ఉన్న ఆహారంతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం ఇనుము శోషణను అడ్డుకుంటుంది. కాఫీ, టీలు..భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని టానిన్లు ఖనిజాల శోషణను తగ్గిస్తాయి.
సప్లిమెంట్లు ఎప్పుడు తీసుకోవాలి మరి..?
సప్లిమెంట్లు (Supplements) సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు. కేవలం రక్త పరీక్షల ద్వారా లోపం ఉందని తేలినప్పుడు లేదా వైద్యుల సూచన మేరకు మాత్రమే వీటిని వాడాలి. అధికంగా సప్లిమెంట్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. వైవిధ్యభరితమైన కూరగాయలు, పప్పుధాన్యాలు, సమతుల్య ఆహారంతో ఖనిజాల లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.