సాక్షి లైఫ్ : కొల్లాజెన్ అనేది మన శరీరంలో ఉండే ఒక ముఖ్యమైన ప్రోటీన్, ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమేకాకుండా జుట్టు రాలకుండా, యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ఎంతోబాగా పనిచేస్తుంది. శరీరం స్వయంగా కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దాని ఉత్పత్తి వయస్సు పెరిగే కొద్దీ తగ్గడం ప్రారంభమవుతుంది. కొల్లాజెన్ లోపం వల్ల కీళ్ల నొప్పులు, చర్మంముడతలు పడడం జరుగుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం..
శరీరంలో కొల్లాజెన్ సరైన మొత్తంలో ఉన్నప్పుడు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటే, మీ వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా అవసరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. అటువంటి పరిస్థితిలో జుట్టు రాలే సమస్య ఉండదు. అంతేకాదు జుట్టు మందంగా, బలంగా మారుతుంది. కొల్లాజెన్ కు సంబంధించిన సప్లిమెంట్లు చర్మం పొడిబారడాన్ని తొలగించడంతోపాటు, సహజమైన మెరుపును తీసుకురావడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.