Ebola Virus Alarms the World : ప్రపంచవ్యాప్తంగా కలవరపడుతున్న ఎబోలా వైరస్.. కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ..!
సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని మరోమారు ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ కలవర పెడుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ), ఉగాండాలలో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని "అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి" (PHEIC) గా ప్రకటించింది. ప్రస్తుతం కనిపిస్తున్న, నమోదవుతున్న కేసుల కంటే వాస్తవంగా ఈ వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ప్రస్తుతానికి దీనిని 'పాండమిక్' గా అంటే.. ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించనప్పటికీ, కాంగో దేశంతో భూసరిహద్దులను పంచుకుంటున్న సుమారు 10 దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించే ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈసారి కలకలం రేపుతున్న ఎబోలా వ్యాప్తికి 'బుందిబుగ్యో' (Bundibugyo) వైరస్ స్ట్రెయిన్ కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై కాంగో ఆరోగ్య మంత్రి శామ్యూల్-రోజర్ కాంబా మాట్లాడుతూ, పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
చికిత్స లేదు..
ఈ ప్రత్యేకమైన బుందిబుగ్యో స్ట్రెయిన్‌కు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ గానీ, ప్రత్యేకమైన చికిత్సా విధానం గానీ అందుబాటులో లేదు. ఈ వైరస్ బారిన పడిన వారిలో మరణాల రేటు (లెథాలిటీ రేట్) దాదాపు 50 శాతం వరకు ఉండే ప్రమాదం ఉంది. తాజా సమాచారం ప్రకారం, కాంగోలోని తూర్పు ఇటూరి ప్రాంతంలోనే ఇప్పటికే 88 మంది అనుమానాస్పద స్థితిలో మరణించగా, 300కు పైగా అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి.
సరిహద్దులు దాటుతున్న మహమ్మారి..
వైరస్ పుట్టిన ప్రాంతానికే పరిమితం కాకుండా వేగంగా ఇతర నగరాలకు, పొరుగు దేశాలకు విస్తరిస్తుండటం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
వ్యాప్తి..
వైరస్ కేంద్ర స్థానమైన ఇటూరి ప్రాంతానికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగో రాజధాని 'కిన్షాసా'లో కూడా ఒక ఎబోలా కేసు లాబొరేటరీ ద్వారా నిర్ధారణ అయ్యింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రముఖ తూర్పు నగరం 'గోమా'లో కూడా ఒక కేసు వెలుగుచూసింది. కాంగో నుంచి ప్రయాణించిన వారి ద్వారా ఉగాండా రాజధాని 'కంపాలా'లో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు ఇప్పటికే మరణించారు.
అప్రమత్తమైన వైద్య బృందాలు..
ప్రముఖ అంతర్జాతీయ వైద్య సేవా సంస్థ 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' (MSF) ఈ వైరస్ వ్యాప్తి రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ తమ జాతీయ విపత్తు, అత్యవసర నిర్వహణ విభాగాలను అప్రమత్తం చేయాలని, సరిహద్దుల్లో కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది.
వైరస్ భయంతో దేశాలు తమ సరిహద్దులను పూర్తిగా మూసివేయడం, ప్రయాణాలు, వాణిజ్యాలపై ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యల వల్ల ప్రజలు దొంగచాటుగా సరిహద్దులు దాటే ప్రమాదం ఉందని, దానివల్ల వైరస్ గుర్తింపు,నిఘా మరింత కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు వెళ్లేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ జారీ చేసే మార్గదర్శకాలను పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
