Amazing Health Benefits of Walking : రోజూ అర గంట నడకతో కలిగే ఐదు అద్భుత్తమైన ఆరోగ్య ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. చాలా మంది బరువు తగ్గాలని, ఫిట్‌గా మారాలని జిమ్‌లలో చేరడానికి పెద్ద పెద్ద తీర్మానాలు (resolutions) చేసుకుంటారు. కానీ, కొద్ది రోజులు గడిచేసరికి ఆ ఉత్సాహం నీరుగారిపోతుంది. జిమ్‌కు వెళ్లడం మానేశామని బాధపడుతుంటారు. అయితే, ఆరోగ్యంగా ఉండటానికి భారీ కసరత్తులు, కఠినమైన వ్యాయామాలే చేయనవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. రోజుకు కేవలం 30 నిమిషాల పాటు సాధారణ నడక సాగిస్తే చాలని, ఇది జిమ్‌కు వెళ్లడం కంటే కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వైద్యులు డాక్టర్ అమీర్ ఖాన్ నిశ్చల జీవనశైలిని దూరం చేసుకోవడానికి నడకను అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గంగా పేర్కొన్నారు. వ్యాయామం అంటేనే కష్టంగా ఉండాలనే ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
నడకతో చేకూరే 5 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు..
1. గుండెకు రక్ష..
ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడవడం వల్ల గుండె కండరాలు బలోపేతమవుతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
2. కీళ్ల నొప్పులకు చెక్..
రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారిలో కీళ్లు బిగుసుకుపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజూ నడవడం వల్ల కీళ్లలో నమ్యత (ఫ్లెక్సిబిలిటీ) పెరుగుతుంది. ఇది వయసుతో పాటు వచ్చే ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. తగ్గనున్న క్యాన్సర్ ముప్పు..
నిత్యం నడవడం వల్ల శరీర బరువు అదుపులో ఉండటమే కాకుండా ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా పేగు, రొమ్ము, మూత్రపిండాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికోసం రోజుకు 10,000 అడుగులు నడవాల్సిన అవసరం లేదని, అరగంట నడక కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుందని స్పష్టమైంది.
4. రోగనిరోధక శక్తి పెంపు..
క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో అంతర్గత వాపులు (inflammation) తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడి, ఒత్తిడి హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా రాత్రి వేళల్లో మంచి నిద్ర పడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది.
5. మానసిక ప్రశాంతత..
నడక కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక శ్రేయస్సుకు ఒక వరం లాంటిది. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు కాసేపు నడిస్తే శరీరంలో 'ఫీల్ గుడ్' హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరిచి ప్రశాంతతను చేకూరుస్తాయి. కాబట్టి, ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు తీసుకోలేకపోయామని నిరాశ పడకుండా.. నేటి నుంచే రోజుకు ఒక అరగంట సమయాన్ని నడక కోసం కేటాయించి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
