Kidney Problems : మూత్రంలో నురగ వస్తోందా..? కిడ్నీ సమస్యేమో జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో ఏదైనా అనారోగ్యం మొదలైతే, మన దేహం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుంది. చర్మం, గోళ్లు, నాలుకతో పాటు మూత్రంలో వచ్చే మార్పులను బట్టి కూడా లోపల ఏం జరుగుతుందో పసిగట్టవచ్చు. ముఖ్యంగా మూత్రపిండాల (Kidney) ఆరోగ్యాన్ని మూత్రం ద్వారా సులభంగా అంచనా వేయవచ్చు. మూత్రం విసర్జించేటప్పుడు అప్పుడప్పుడూ కొద్దిగా నురగ రావడం సాధారణమే. కానీ, తరచూ అదే పనిగా నురగ వస్తుంటే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

కిడ్నీలకూ, నురగకూ సంబంధం ఏమిటి..?

మన శరీరంలోని రక్తాన్ని నిరంతరం వడబోసి, వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపే కీలకమైన పని కిడ్నీలది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రక్తానికి అవసరమైన ప్రొటీన్లను మూత్రంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. కానీ, వాటి వడపోత ప్రక్రియ దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్లు మూత్రంలోకి లీక్ అవుతాయి. దీనినే వైద్య పరిభాషలో 'ప్రొటీన్యూరియా' లేదా 'ఆల్బుమిన్యూరియా' అంటారు. ఇలా మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా బయటకు పోవడం వల్లే నురగ లేదా బుడగలు వస్తుంటాయి.

ఆందోళన ఎప్పుడు అవసరం లేదు..?

మూత్రం వేగంగా పడినప్పుడు, శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు (dehydration), లేదా టాయిలెట్‌లో వాడే రసాయనాల వల్ల కూడా ఒక్కోసారి నురగ రావచ్చు. ఇలా అరుదుగా జరిగితే కంగారు పడాల్సిన పనిలేదు.

వైద్యులను ఎప్పుడు కలవాలి..?

రోజూ మూత్రంలో విపరీతమైన నురగ వస్తున్నా, ఆ నురగ చాలాసేపు అలాగే ఉండిపోతున్నా తప్పనిసరిగా అప్రమత్తం కావాలి. ఇది కిడ్నీలు దెబ్బతింటున్నా యనడానికి సంకేతం కావచ్చు. కిడ్నీ సమస్యలు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలనూ బయటపెట్టవు కాబట్టి, నురగతో పాటు ఈ కింది లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ల చుట్టూ, ముఖంపై ఉదయాన్నే వాపు కనిపించడం, చేతులు, పాదాలు, చీలమండల వద్ద తరచూ వాపులు రావడం,రక్తపోటు (bp) అకస్మాత్తుగా పెరగడం.

ముఖ్యంగా మధుమేహం (diabetes), అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు, అలాగే కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు మూత్రంలో నురగ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

పనితీరును పసిగట్టే పరీక్షలు..

కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ప్రధానంగా ఈ పరీక్షలను సూచిస్తారు. UACR యూరిన్ ఆల్బుమిన్-టు-క్రియేటినిన్ రేషియో ..ఇది మూత్రంలో ఆల్బుమిన్, క్రియేటినిన్ నిష్పత్తిని కొలుస్తుంది. ఈ ఫలితం 30 mg/g కంటే తక్కువ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. 30 దాటితే కిడ్నీ సమస్య ఉన్నట్లుగా భావించి తదుపరి చికిత్స అందిస్తారు. క్రియేటినిన్, eGFR.. కిడ్నీల పనితీరు, వడపోత సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి రక్తంలో క్రియేటినిన్ స్థాయిలతో పాటు 'ఈజీఎఫ్ఆర్' పరీక్షలు కూడా అవసరమవుతాయి.

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.