FSSAI : గుడ్డుపై వదంతులు నమ్మొద్దు.. క్యాన్సర్ పుకార్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక వివరణ..!  

షేర్ చేయండి:
FSSAI : గుడ్డుపై వదంతులు నమ్మొద్దు.. క్యాన్సర్ పుకార్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక వివరణ..!  

సాక్షి లైఫ్ : కోడిగుడ్డు.. సామాన్యుడికి చౌకగా దొరికే పోషకాల గని. అయితే గత కొద్దిరోజులుగా గుడ్డు చుట్టూ ముసురుకున్న క్యాన్సర్ ఆందోళనలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) రంగంలోకి దిగింది. గుడ్డులో యాంటీబయాటిక్ అవశేషాల పేరిట జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత..? వైద్యనిపుణుల నివేదికలు ఏం చెబుతున్నాయి..? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

పుకార్లకు కారణం ఏమిటి..?

కొన్ని సోషల్ మీడియా పోస్టులు, వీడియోలలో గుడ్లలో 'నైట్రోఫ్యూరాన్ మెటబాలైట్స్' (Nitrofuran Metabolites - AOZ) అనే యాంటీబయాటిక్ అవశేషాలు ఉన్నాయని, ఇవి క్యాన్సర్‌కు దారితీస్తాయని ప్రచారం జరిగింది. ఒక నిర్దిష్ట బ్రాండ్‌కు చెందిన గుడ్ల పరీక్షల రిపోర్టులను ఉటంకిస్తూ ఈ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన క్లారిటీ ఇదే.. 

డిసెంబర్ 20, 2025 విడుదల చేసిన అధికారిక ప్రకటనలో FSSAI కీలక అంశాలను వెల్లడించింది..అవేంటంటే..? భారతీయ నిబంధనల (Food Safety and Standards Regulations, 2011) ప్రకారం పౌల్ట్రీ పరిశ్రమలో నైట్రోఫ్యూరాన్ల వాడకం పూర్తిగా నిషేధం. ఆహార పదార్థాల్లో ఈ రసాయనాల ఉనికిని గుర్తించడానికి కనిష్ట పరిమితిని (EMRL) కేవలం పరీక్షల కోసం ప్రామాణికంగా ఉపయోగిస్తారు. అంతకంటే తక్కువ స్థాయిలో ఏవైనా అవశేషాలు ఉన్నా, అది ఆరోగ్యానికి హానికరమని లేదా నిబంధనల ఉల్లంఘన అని అర్థం కాదు.

స్వల్ప స్థాయిలో ఈ అవశేషాలు ఉన్నప్పటికీ, వాటివల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆరోగ్య సంస్థ కూడా గుడ్డు వినియోగాన్ని క్యాన్సర్‌తో ముడిపెట్టలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఏదైనా ఒక బ్యాచ్‌లో లేదా ఒక బ్రాండ్‌లో లోపాలు కనిపిస్తే.. అది ఆ ఒక్క బ్యాచ్‌కు లేదా ఫీడ్‌కు సంబంధించిన పొరపాటు మాత్రమే తప్ప, దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే అన్ని గుడ్లు అసురక్షితమని చెప్పడం శాస్త్రీయంగా తప్పు.

వినియోగదారులు ఏం చేయాలి..?

వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల్లో వచ్చే అశాస్త్రీయ వార్తలను నమ్మి పౌష్టికాహారాన్ని దూరం చేసుకోవద్దు. గుడ్డులో నాణ్యమైన ప్రొటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. సమతుల్య ఆహారంలో గుడ్డు ఒక ముఖ్యమైన భాగమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పునరుద్ఘాటించింది. ఆహార భద్రతకు సంబంధించిన ఏదైనా సందేహం ఉంటే నేరుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ వెబ్‌సైట్ లేదా అధికారిక ప్రకటనలను గమనించాలి.

ముఖ్యంగా కోడిగుడ్డుపై వస్తున్న వార్తలు కేవలం ప్రజల్లో భయాందోళనలు కలిగించే పుకార్లు మాత్రమే. మన దేశంలోని ఆహార భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని, నిశ్చింతగా గుడ్లను ఆహారంగా తీసుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.