Liver Damage : చర్మం, కళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? కాలేయం దెబ్బతింటోందేమో జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే కాలేయ (liver) సమస్యలు ఇప్పుడు యువతలోనూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ కేసులు మన దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఆహారాన్ని జీర్ణం చేయడం, వ్యర్థాలను బయటకు పంపడం, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం వంటి కీలక పనులను లివర్ చేస్తుంది. లివర్ దెబ్బతింటుందని చెప్పే కొన్ని ప్రధాన లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం..
కళ్లలోని తెల్లటి భాగం, చర్మం పసుపు రంగులోకి మారితే దాన్ని పచ్చకామెర్లు (jaundice)గా అనుమానించాలి. రక్తంలో 'బిలిరుబిన్' స్థాయిలు పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది లివర్ డ్యామేజ్‌కు స్పష్టమైన సంకేతం. కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని సాధారణ చర్మ సమస్యగా పొరబడకూడదు.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
తీవ్రమైన దురద..
చర్మంపై ఎలాంటి దద్దుర్లు లేదా ఎర్రటి మచ్చలు లేకపోయినా విపరీతమైన దురదగా అనిపిస్తుంటే.. అది కాలేయం లేదా పిత్తాశయ సమస్యలకు సూచిక కావచ్చు. ఈ సమస్య రోజులు తరబడి వేధిస్తుంటే లివర్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.
త్వరగా గాయాలవ్వడం..
రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పలు ప్రొటీన్లను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. లివర్ పనితీరు మందగిస్తే ఈ ప్రొటీన్ల ఉత్పత్తి తగ్గిపోయి.. చిన్న దెబ్బలకే చర్మం కమిలిపోవడం లేదా తరచుగా రక్తస్రావం జరగడం లాంటివి జరుగుతాయి.
కడుపు, కాళ్లలో వాపు..
కాలేయ సమస్యలు తీవ్రమైన దశకు చేరుకున్నప్పుడు కడుపులో ద్రవాలు చేరి వాపుగా (swelling)అనిపిస్తుంది. దీనికి తోడు కాళ్ల వాపులు, విపరీతమైన నీరసం, ఆకలి మందగించడం, మూత్రం ముదురు రంగులో రావడం, మలం లేత రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా లివర్‌ను పదిలంగా కాపాడుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారం మందులు, హెర్బల్ సప్లిమెంట్లు వాడకూడదు. పచ్చకామెర్లతో పాటు తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
