High Uric Acid : యూరిక్ యాసిడ్ వేధిస్తోందా..? ఈ పండ్లు, ఆహారాలతో సహజంగా తగ్గించుకోండి..!
సాక్షి లైఫ్ : శరీరంలో యూరిక్ యాసిడ్ (Uric acid) స్థాయిలు పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, గౌట్ వ్యాధి, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయని మనకు తెలిసిందే. అయితే, రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు. యూరిక్ యాసిడ్‌ను కరిగించి, శరీరం నుంచి బయటకు పంపేందుకు ఏయే పండ్లు, ఆహార పదార్థాలు తినాలో చూద్దాం..
చెర్రీ పండ్లు (Cherries)..
యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో చెర్రీస్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే 'ఆంథోసైనిన్స్' (Anthocyanins) యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంతో పాటు కీళ్ల వాపు, నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
సిట్రస్ పండ్లు (Citrus Fruits)..
విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మ, కమలాఫలం, నారింజ, బత్తాయి వంటి పండ్లు శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడతాయి. రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగడం ఎంతో మేలు చేస్తుంది.
యాపిల్స్ (Apples)..
యాపిల్స్‌లో ఉండే 'మాలిక్ యాసిడ్' రక్తంలోని యూరిక్ యాసిడ్ ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది (Neutralize). రోజుకో యాపిల్ తినడం వల్ల కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా పేరుకుపోకుండా కాపాడుకోవచ్చు.
అరటిపండ్లు (Bananas)..
అరటిపండ్లలో యూరిక్ యాసిడ్‌ను పెంచే 'ప్యూరిన్లు' (Purines) చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే అధిక పొటాషియం.. యూరిక్ యాసిడ్ గట్టిపడి రాళ్లుగా మారకుండా నిరోధించి, కిడ్నీలు వాటిని సులభంగా బయటకు పంపేలా చేస్తుంది.
పీచు (Fiber-rich foods) ఎక్కువగా ఉండే ఆహారం..
ఓట్స్ (Oats), బ్రౌన్ రైస్, జొన్నలు, బార్లీ వంటి తృణధాన్యాలు, కూరగాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం రక్తంలోని అదనపు యూరిక్ యాసిడ్‌ను గ్రహించి, మలమూత్రాల ద్వారా శరీరంలో నుంచి బయటకు పంపేస్తుంది.
గ్రీన్ టీ (Green tea)..
రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
యాపిల్ సైడర్ వెనిగర్..
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar) కలుపుకుని తాగడం వల్ల కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
నీళ్లు.. ద్రవ పదార్థాలు..
వీటన్నింటితో పాటు రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం అత్యంత ముఖ్యం. శరీరం హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు కిడ్నీల పనితీరు మెరుగై, యూరిక్ యాసిడ్‌తో పాటు ఇతర మలినాలు కూడా సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఈ ఆహార పదార్థాలు యూరిక్ యాసిడ్‌ను సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. కానీ సమస్య మరీ తీవ్రంగా ఉండి, కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు మాత్రం కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
