Organ donation : మధుమేహం ఉన్నవారు అవయవదానం చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అవయవదానం (Organ donation)అనేది ఒకరికి పునర్జన్మ ఇవ్వడంతో సమానం. మనం ఈ లోకం విడిచివెళ్లినా, మన అవయవాల ద్వారా ఇతరుల రూపంలో సజీవంగానే ఉండొచ్చు. అయితే, అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, ఇంకా అనేక అపోహలు, సందేహాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా "మధుమేహం (diabetes), బీపీ వంటి వ్యాధులు ఉన్నవారు అవయవదానం చేయవచ్చా?" అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. అవయవదానానికి సంబంధించిన ఈ కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

భారత్‌లో పరిస్థితి ఇదీ..

దేశంలో అవయవాల కొరత తీవ్రంగా ఉంది. అవయవాలు దొరకక ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ సమయంలో చూసినా కనీసం 3 లక్షల మంది రోగులు అవయవాల కోసం నిరీక్షిస్తున్నారు. సకాలంలో అవయవాలు అందకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 20 మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా కాలేయం (liver), గుండె అవసరం ఉన్న రోగుల సంఖ్య అధికంగా ఉంది.

ఏయే అవయవాలు దానం చేయొచ్చు..?

బ్రెయిన్ డెడ్ లేదా మరణానంతరం కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, పేగులు వంటి ప్రధాన అవయవాలతో పాటు.. కంటి కార్నియా, చర్మం, ఎముకలు, గుండె కవాటాలు (valves) వంటి కణజాలాలను కూడా దానం చేయవచ్చు. ఒక వ్యక్తి మరణానంతరం చేసే దానం ద్వారా ఎంతో మందికి కొత్త జీవితం లభిస్తుంది.

డయాబెటిస్ రోగులు దానం చేయొచ్చా..?

కచ్చితంగా చేయొచ్చు..! మధుమేహం ఉన్నవారు అవయవదానానికి పనికిరారు అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. దీర్ఘకాలంగా షుగర్ కంట్రోల్‌లో లేకపోతే గుండె, కిడ్నీలు, కాలేయం వంటి వాటిపై ప్రభావం పడే మాట వాస్తవమే. కానీ, మరణించిన సమయంలో వైద్య నిపుణుల బృందం ఆ వ్యక్తి మెడికల్ హిస్టరీని, అవయవాల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

డయాబెటిస్ ఉన్నప్పటికీ.. ఆరోగ్యంగా, దానానికి అనువుగా ఉన్న అవయవాలను మాత్రమే వైద్యులు సేకరిస్తారు. కాబట్టి షుగర్ లేదా బీపీ ఉందనే ఉద్దేశంతో మీ అంతట మీరే అవయవదానానికి అనర్హులని నిర్ణయించుకోకండి.

ఎవరు చేయకూడదు..?

వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా అవయవదానానికి ముందుకు రావచ్చు. అయితే క్యాన్సర్, యాక్టివ్ టీబీ (tb), తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా సెప్సిస్ (Sepsis)తో మరణించిన వారి నుంచి సాధారణంగా అవయవాలను స్వీకరించరు. దానానికి ఏది అనువైనదో చివరికి వైద్యులే నిర్ధారిస్తారు.


కుటుంబానికి సమాచారం..

మీరు అవయవదానం చేయాలని నిర్ణయించుకుంటే, ఆ విషయాన్ని ముందుగా మీ కుటుంబ సభ్యులకు కచ్చితంగా తెలియజేయండి. మరణానంతరం వారి అనుమతితోనే ప్రక్రియ పూర్తవుతుంది. అవయవదానం అనేది కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రులు, కచ్చితమైన చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే జరగాలి. భారతదేశ చట్టాల ప్రకారం మానవ అవయవాలను కొనడం లేదా అమ్మడం నేరం. ఇది కేవలం స్వచ్ఛందంగా, ఉచితంగా చేసే దానం మాత్రమే.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.