Sitting Too Long Harmful As Smoking : యువతకు ఈ అలవాటే ప్రాణాంతక శత్రువు.. కదలకుండా కూర్చోవడం.. ధూమపానంతో సమానం.. !
సాక్షి లైఫ్ : నిన్న, మొన్నటివరకు గుండెపోటు (Heart Attack) అంటే కేవలం వృద్ధులకు, యాభై దాటిన వారికి మాత్రమే వచ్చే జబ్బు అనుకునేవాళ్లం. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండే నవయువకులు సైతం ఆకస్మికంగా గుండె ఆగి ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేసేవారు, ఎలాంటి దురలవాట్లు లేనివారు కూడా హఠాత్తుగా కుప్పకూలిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంత దృఢంగా ఉండాల్సిన యువత గుండె.. ఎందుకు ఇంతలా బలహీనపడుతోంది..? ఒత్తిడి, జంక్ ఫుడ్‌ను మించి మనల్ని వెంటాడుతున్న ఆ 'అదృశ్య శత్రువు' ఏంటి..? ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
కార్యాలయాల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు, ల్యాప్‌టాప్‌ల ముందు కదలకుండా కూర్చోవడమే నేటి యువత గుండెకు అతిపెద్ద శాపంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిశ్చల జీవనశైలిని (Sedentary Lifestyle) ఏకంగా ధూమపానంతో (Smoking) పోల్చింది. సిగరెట్ తాగడం వల్ల గుండెకు ఎంతటి ప్రమాదం పొంచి ఉందో.. రోజంతా ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా అంతే ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిరంతరాయంగా ఒకే చోట కూర్చొని ఉద్యోగం చేసేవారిలో గుండె జబ్బులు, ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు 200శాతం అవుతుందని ప్రముఖ కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
ఒకేచోట కూర్చుంటే గుండెలో ఏం జరుగుతుంది..?
మనం శారీరక శ్రమను పూర్తిగా తగ్గించి, ఒకే చోట స్థిరంగా ఉండిపోయినప్పుడు శరీరంలో కొన్ని ప్రతికూల రసాయన మార్పులు సంభవిస్తాయి. నిరంతరం కూర్చోవడం వల్ల కాళ్ల వైపు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. ఇది ధమనులలో రక్తం గడ్డకట్టే (Blood Clots) ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రక్తం గడ్డలు గుండెకు లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాలను పూడ్చివేసినప్పుడు హార్ట్ ఎటాక్, పక్షవాతం (Stroke) సంభవిస్తాయి.
జీవక్రియల లోపం (Metabolic Syndrome)..
కదలికలు లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే ఎంజైమ్‌ల ఉత్పత్తి పడిపోతుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) ధమనుల గోడలపై పేరుకుపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.
ఇన్సులిన్ నిరోధకత (Insulation Resistance)..
వ్యాయామం చేయని వారిలో ఇన్సులిన్ హార్మోన్ పనితీరు మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహానికి, తద్వారా గుండె జబ్బులకు దారితీస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడిస్తోంది.
జిమ్‌కు వెళ్తున్నా ప్రమాదం తప్పదా..?
చాలామంది తాము ఉదయం పూట గంటసేపు జిమ్‌లో కష్టపడుతున్నాం కాబట్టి, ఆఫీసులో రోజంతా కూర్చున్నా ఏమీ కాదు అని భ్రమిస్తుంటారు. కానీ పరిశోధనల ప్రకారం.. ఉదయం వ్యాయామం చేసినప్పటికీ, ఆ తర్వాత ఆఫీసులో 6 నుంచి 8 గంటల పాటు నిరంతరాయంగా సీటుకే పరిమితమైతే గుండె జబ్బుల ముప్పు ఏమాత్రం తగ్గదు. నిరంతర కదలికలే గుండెకు అసలైన రక్ష..
గుండెను 'పదిలం'గా ఉంచుకునే మార్గాలు ఇవే..!
ఆఫీసు పని ఒత్తిడిని కాదనలేం.. అలాగని గుండె ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం. అందుకే దినచర్యలో ఈ క్రింది చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
30 నిమిషాల నియమం (The 30-Minute Rule)..ఆఫీసు పనిలో ఉన్నప్పటికీ ప్రతి 30 నుండి 40 నిమిషాలకు ఒకసారి సీట్లోంచి లేచి కనీసం 2-3 నిమిషాల పాటు అటూ ఇటూ నడవాలి. వీలైతే కొన్ని స్క్వాట్స్ (Sit-ups) చేయాలి.
మెట్ల వినియోగం.. లిఫ్ట్‌లకు బదులుగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకే చోట కూర్చోకుండా నడుస్తూ మాట్లాడటం మంచిది.
రోజువారీ వ్యాయామం..వారంలో కనీసం 5 రోజులు, రోజుకు 30 నుండి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం (Brisk Walking), యోగా లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది.
సమతుల్య ఆహారం..ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, నూనె పదార్థాలను పక్కన పెట్టి.. పీచుపదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తృణధాన్యాలు, తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
వ్యసనాలకు దూరం.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానం, మద్యపాన అలవాట్లకు ఎంత త్వరగా దూరమైతే అంత మంచిది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జిమ్‌లలో గంటల తరబడి కఠినమైన కసరత్తులు చేయాల్సిన పనిలేదు. నిరంతరం చురుగ్గా ఉండటం, గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా ఉండటమే మీ గుండె ఆయుష్షును పెంచుతుంది.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
