ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా శరీరంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
సాక్షి లైఫ్ : ఫోలిక్ యాసిడ్, అంటే విటమిన్ బీ9, శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది రక్త హీనత నివారణ, కణాల పెరుగుదల, డీఎన్ఏ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ లోపాన్ని కొన్ని ముఖ్యమైన లక్షణాలను గుర్తించడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.
ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
తీవ్రమైన అలసట, బలహీనత..
ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది, ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీని వల్ల నీరసం, అలసట, శారీరక బలహీనత అనిపిస్తుంది. సాధారణ పనులు చేయడానికి కూడా శక్తి లేనట్లు ఉంటే, ఇది ఫోలిక్ యాసిడ్ లోపం సంకేతం కావచ్చు.
చర్మం పాలిపోవడం..
ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడి, చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. ముఖం, పెదవులు, లేదా గోళ్లు రంగు కోల్పోవడం ఫోలిక్ యాసిడ్ లోపించిందనడానికి స్పష్టమైన సంకేతాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మానసిక సమస్యలు..
ఫోలిక్ యాసిడ్ లోపం మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మతిమరుపు, నిరాశ, చిరాకు, లేదా ఏకాగ్రత లోపం వంటి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. ఈ లక్షణాలు దీర్ఘకాలంగా కొనసాగితే, ఫోలిక్ యాసిడ్ స్థాయిలను తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
రక్తంలో ఆక్సిజన్ తీసుకెళ్లే ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెట్లు ఎక్కినప్పుడు లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినప్పుడు ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.
నోటి పుండ్లు,నాలుక వాపు..
ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల నోటిలో పుండ్లు, నాలుక వాపు, లేదా నాలుక ఎరుపెక్కడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నోటి లోపలి భాగం సున్నితంగా మారడం లేదా తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే, ఫోలిక్ యాసిడ్ లోపాన్ని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
