ఈ అలవాట్లు గుండె జబ్బులకు దారితీస్తాయి.. మహిళలు జాగ్రత్త..!

షేర్ చేయండి:
ఈ అలవాట్లు గుండె జబ్బులకు దారితీస్తాయి.. మహిళలు జాగ్రత్త..!

సాక్షి లైఫ్‌ : ఈ రోజుల్లో గుండెపోటు అనేది వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ కలవరపెడుతున్న సమస్య. ముఖ్యంగా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం గురించి అవగాహన చాలా అవసరం. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు. కొన్నిరకాల అలవాట్లు గుండెకు చేటు చేస్తాయి, అటువంటి అలవాట్ల విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

ఎలాంటి అలవాట్లు గుండె జబ్బులకు దారితీస్తాయంటే..?  

 మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బులు, గుండెపోటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. సాధారణంగా గుండెపోటు పురుషుల్లో ఎక్కువగా వస్తుందని భావించినప్పటికీ, మహిళల్లోనూ దీని ముప్పు గణనీయంగా పెరుగుతోంది. గుండె జబ్బులకు దారితీసే కొన్ని అలవాట్లను, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళల్లో గుండెపోటు..

గుండెపోటు లక్షణాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో కాస్త భిన్నంగా ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఛాతీ నొప్పి, ఎడమ చేయి నొప్పి వంటివి పురుషుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలైతే, మహిళల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వివరించలేని అలసట, తలనొప్పి, వికారం, దవడ లేదా వెన్ను నొప్పి వంటి అసాధారణ లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలు కావచ్చని వైద్యులుహెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.  

గుండె జబ్బులకు కారణమయ్యే అలవాట్లు..  

ధూమపానం, పరోక్ష ధూమపానం: ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, మహిళల్లో పరోక్ష ధూమపానం (పాసివ్ స్మోకింగ్) కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ధూమపానం చేస్తే, ఆ పొగ పీల్చడం వల్ల మహిళల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్, వేపుళ్లు, అధిక కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ ఉప్పు, చక్కెర వినియోగం గుండెకు హానికరం. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచి గుండె జబ్బులకు దారితీస్తాయి.

శారీరక శ్రమ లేకపోవడం: నిశ్చల జీవనశైలి గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుంది. తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగడం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు తలెత్తి గుండెకు ప్రమాదాన్ని పెంచుతాయి.మానసిక ఒత్తిడి: ఆధునిక జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఇంటి, వృత్తిపరమైన బాధ్యతలు, హార్మోన్ల హెచ్చుతగ్గులు ఒత్తిడిని పెంచి గుండెపోటుకు కారణం కావచ్చు.

తగినంత నిద్ర లేకపోవడం: నిద్రలేమి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర లేకపోతే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక బరువు, ఊబకాయం: అధిక బరువు, ఊబకాయం రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

మధుమేహం, రక్తపోటు నియంత్రణ లేకపోవడం: మధుమేహం,అధిక రక్తపోటు ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను, బీపీని నియంత్రణలో ఉంచుకోకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.