Bad Cholesterol : ఒకే ఒక్క సెలైన్‌తో.. చెడు కొలెస్ట్రాల్‌కు శాశ్వతంగా చెక్..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol. LDL) గుండె జబ్బులకు, ఆకస్మిక గుండెపోట్లకు ప్రధాన కారణం. దీనిని అదుపులో ఉంచేందుకు రోగులు ఏళ్ల తరబడి రోజూ స్టాటిన్ మాత్రలు మింగాల్సి వస్తోంది. అయితే, కేవలం ఒకే ఒక్క సెలైన్ డ్రిప్‌తో చెడు కొలెస్ట్రాల్‌ను శాశ్వతంగా నియంత్రించే సరికొత్త ప్రయోగాత్మక జన్యు సవరణ చికిత్స 'వెర్వ్-102' (VERVE-102) వైద్య రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్..

అమెరికాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ ఔషధం తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో గరిష్ఠ మోతాదుతో ఏకంగా 62 శాతం వరకు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించినట్లు 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో వెల్లడైంది. జన్యుపరమైన సమస్యలతో తీవ్రమైన కొలెస్ట్రాల్ ముప్పు ఎదుర్కొంటున్న వారి కోసం అమెరికా ఎఫ్‌డీఏ (FDA) దీనికి 'ఫాస్ట్ ట్రాక్' హోదా కల్పించింది.

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

 

ఎలా పనిచేస్తుంది..?

ఒకే ఒక్క డ్రిప్.. దాదాపు 4 గంటల వ్యవధిలో సెలైన్ (IV Drip) ద్వారా ఈ ఔషధాన్ని నరాల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు.  కాలేయ కణాల్లో ఉండే 'పీసీఎస్‌కే9' (PCSK9) అనే జన్యువును ఈ థెరపీ శాశ్వతంగా పనిచేయకుండా (switches off) చేస్తుంది.

లిపిడ్ నానో టెక్నాలజీ..

సూక్ష్మ కణాల (Lipid nanoparticles) సాయంతో మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ (mRNA), గైడ్ ఆర్‌ఎన్‌ఏలను కాలేయంలోని నిర్దిష్ట జన్యువు వద్దకు చేరవేస్తారు.

కొలెస్ట్రాల్ శుద్ధి..

 సాధారణంగా పీసీఎస్‌కే9 ప్రొటీన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే రిసెప్టార్లను అడ్డుకుంటుంది. ఈ జన్యువును ఆపేయడం వల్ల కాలేయం రక్తంలోని ఎల్‌డీఎల్‌ను సహజంగానే వేగంగా బయటకు పంపేస్తుంది.

నిపుణుల పరిశీలన... భద్రతపై ఆందోళనలు..

గుండె జబ్బులను నివారించేందుకు ఇదొక వ్యాక్సిన్‌లా ఉపయోగపడవచ్చని కొందరు వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, దీని వాడకం విస్తృతం కావడానికి మరికొన్నేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. జన్యువులలో శాశ్వత మార్పులు చేయడం వల్ల కాలేయం, రోగనిరోధక వ్యవస్థపై దీర్ఘకాలంలో ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయో నిశితంగా పరిశీలించాల్సి ఉంది.

 

గతంలో చేపట్టిన 'వెర్వ్-101' తొలి ప్రయోగాల్లో కాలేయ ఎంజైములు పెరగడం, ప్లేట్‌లెట్లు తగ్గడం వంటి సమస్యలతో పరిశోధనలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఎంతటి అధునాతన జన్యు చికిత్సలు అందుబాటులోకి వచ్చినా సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులకు ప్రత్యామ్నాయం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.