Breastfeeding : భారీగా పడిపోతున్న తల్లిపాలు తాగే శిశువుల సంఖ్య.. NFHS-6, 2023-24 నివేదిక వెల్లడి..
సాక్షి లైఫ్ : శిశువుల ఆరోగ్య రక్షణలో అత్యంత కీలకమైన తల్లిపాలు, టీకాల విషయంలో ఆందోళనకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6, 2023-24) నివేదిక దేశవ్యాప్తంగా శిశు ఆరోగ్యంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలనే అవగాహన క్రమంగా సన్నగిల్లుతున్నట్లు ఈ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భారీగా పడిపోయిన తల్లిపాలతో పాటు ఆరోగ్య సూచికల వివరాలు..
తల్లిపాలు పట్టడంలో.. గత ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 నివేదిక నాటికి ఆరు నెలల వయసు వరకు తల్లిపాలు ఇస్తున్న శిశువుల రేటు 67.4 శాతంగా ఉండేది. అయితే, తాజా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 (2023-24) నాటికి ఈ శాతం ఏకంగా 21.2 శాతానికి పడిపోయింది. కేవలం ఒక్క సర్వే వ్యవధిలోనే ఈ సేవలో 46.2 శాతం మేర భారీ తగ్గుదల నమోదు కావడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
పెరుగుతున్న డయేరియా ముప్పు..
పసిప్రాయంలో సరైన పోషకాహారం, తల్లిపాలు అందకపోవడం వల్ల శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తోంది. ఫలితంగా చిన్నారులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. గతంలో 6.1 శాతంగా ఉన్న డయేరియా(Diarrhea) బారిన పడుతున్న పిల్లల శాతం, ప్రస్తుతం ఏకంగా 15.3 శాతానికి ఎగబాకింది.
టీకాలు, విటమిన్లలో వెనుకడుగు..
కేవలం తల్లిపాలు మాత్రమే కాకుండా, ప్రాణాలను రక్షించే కీలకమైన వ్యాధి నిరోధక టీకాల విషయంలోనూ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. హెపటైటిస్-బి మూడో డోసు తీసుకునే పిల్లల సంఖ్య గతంలో 82.7 శాతంగా ఉండగా, అది ఇప్పుడు 62.8 శాతానికి పడిపోయింది. అలాగే, చిన్నారుల ఎదుగుదలకు అత్యంత అవసరమైన విటమిన్-ఏ డోసులు పొందే పిల్లల శాతం కూడా 82.7 శాతం నుంచి 65.5 శాతానికి పరిమితమైంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఒక సానుకూల పరిణామం..
ఈ నివేదికలోనే కొన్ని ప్రోత్సాహకరమైన అంశాలు కూడా వెలుగు చూశాయి. దేశంలో సంస్థాగత ప్రసవాలు పెరుగుతుండడం, ప్రసవానంతరం తల్లుల సంరక్షణ మెరుగుపడుతుండడం గమనార్హం. ముఖ్యంగా పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు పట్టే తల్లుల శాతం గతం కంటే మెరుగైంది. గతంలో 26.7 శాతంగా ఉన్న ఈ శాతం తాజా నివేదికలో 37.1 శాతానికి పెరిగినట్లు స్పష్టమైంది.
పసిపిల్లల్లో పెరుగుతున్న అనారోగ్య ముప్పులను నివారించడానికి, తల్లిపాలు, క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించడంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
