Cervical Cancer : 2048 నాటికి సర్వైకల్ క్యాన్సర్ అంతం సాధ్యమేనా..? భారత్ ముందున్న మార్గమేంటి..?
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మహిళల ప్రాణాలను హరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో సర్వైకల్ క్యాన్సర్ (Cervical cancer) ప్రధానమైనది. ఏటా సుమారు 3.5 లక్షల మందికి పైగా మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. అంటే.. సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోతోంది. అయితే, సరైన సమయంలో స్పందించి జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్‌ను సులభంగానే నివారించవచ్చు. ముఖ్యంగా 'హ్యూమన్ పాపిలోమావైరస్' (HPV) టీకాతో ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
2048 నాటికి ముప్పు తప్పుతుందా..?
ఆధునిక వైద్య సదుపాయాలు, విస్తృతమైన స్క్రీనింగ్ పరీక్షలు, పకడ్బందీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో అభివృద్ధి చెందిన దేశాలు 2048 నాటికి సర్వైకల్ క్యాన్సర్‌ను పూర్తిగా పారద్రోలే దిశగా దూసుకుపోతున్నాయి. కానీ, అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సరైన అవగాహన లేకపోవడం, టీకాల కొరత కారణంగా పేద దేశాల్లో మహిళలు ఈ మహమ్మారికి బలవుతున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అంటే..?
కెనడాలోని లావల్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. 99 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు 'హ్యూమన్ పాపిలోమావైరస్' (HPV) వల్లే వస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కొనసాగితే, పేద దేశాల్లో ఈ క్యాన్సర్ వ్యాప్తి రేటు కేవలం 23 శాతం మాత్రమే తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ఒకవేళ ఆయా దేశాల్లో కనీసం 90 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోగలిగితే.. ఆఫ్రికా లాంటి దేశాలు మినహా మిగతా చోట్ల ఈ క్యాన్సర్‌ను దాదాపుగా అంతం చేయవచ్చని స్పష్టం చేశారు.
డబ్ల్యూహెచ్ఓ '90-70-90' ఫార్ములా..
ప్రతి లక్ష మంది మహిళల్లో క్యాన్సర్ కేసులను నాలుగు కంటే తక్కువకు పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం '90-70-90' ఫార్ములాను తీసుకువచ్చింది. ఇందులో ప్రధానంగా.. 15 ఏళ్లలోపు బాలికల్లో 90 శాతం మందికి తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా వేయించాలన్నది ముఖ్య ఉద్దేశం.
భారతదేశంలో పరిస్థితి ఏంటి? క్యాన్సర్ ఫ్రీ ఎప్పుడు..?
లాన్సెట్ ఆంకాలజీ నివేదిక (సెప్టెంబర్ 2022) ప్రకారం.. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులను గణనీయంగా తగ్గించేందుకు సానుకూల వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా 90 శాతం కవరేజీతో 'సింగిల్ డోస్ వ్యాక్సినేషన్' విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తే.. క్యాన్సర్ కేసుల్లో ఏకంగా 78 శాతం వరకు తగ్గుదల నమోదు కావచ్చని నివేదిక స్పష్టం చేసింది.
తక్కువ ధరకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం, సింగిల్-డోస్ విధానాన్ని ప్రోత్సహించడం, పాఠశాల స్థాయి నుంచే ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు.. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అబ్బాయిలను కూడా భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్తులో మన దేశం సర్వైకల్ క్యాన్సర్ రహిత దేశంగా ఆవిర్భవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
