Stones Risk : మన గొంతులో కూడా రాళ్లు ఏర్పడతాయనే విషయం మీకు తెలుసా..? 

షేర్ చేయండి:
Stones Risk : మన గొంతులో కూడా రాళ్లు ఏర్పడతాయనే విషయం మీకు తెలుసా..? 

సాక్షి లైఫ్ : శరీరంలో రాళ్లు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేవి మూత్రపిండాలు, పిత్తాశయం (గాల్ బ్లాడర్) మాత్రమే. ఇవి వస్తే విపరీతమైన కడుపునొప్పి, వాంతులు అవుతాయి. కానీ, కిడ్నీల్లోనే కాదు.. మన గొంతులో కూడా రాళ్లు ఏర్పడతాయనే విషయం మీకు తెలుసా..? చాలామంది నోటి దుర్వాసనతోనో, గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు ఉండే అసౌకర్యంతోనో బాధపడుతుంటారు కానీ, దానికి అసలు కారణం గొంతులో ఏర్పడే రాళ్లేనని గ్రహించలేరు. వైద్య పరిభాషలో వీటినే 'టాన్సిల్ స్టోన్స్' (Tonsil Stones) లేదా 'టాన్సిల్లోలిత్స్' అంటారు. ఈ రాళ్లు కిడ్నీ రాళ్లలా అంత ప్రమాదకరమైనవి కావు, తీవ్రమైన నొప్పిని కలిగించవు. కానీ, నిరంతరం గొంతులో ఏదో అడ్డం పడినట్లు అనిపిస్తూ చికాకు పెడుతుంటాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి..? వీటిని గుర్తించడం ఎలా గుర్తించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

 

'టాన్సిల్ రాళ్లు' ఎలా ఏర్పడతాయి..?

మన గొంతు వెనుక భాగంలో ఇరువైపులా ఉండే టాన్సిల్స్.. శరీర రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బయటి నుంచి వచ్చే సూక్ష్మక్రిములను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అయితే, కొంతమందికి ఈ టాన్సిల్స్ ఉపరితలంపై చిన్న చిన్న గుంతలు, పగుళ్లు కాస్త లోతుగా ఉంటాయి. మనం ఆహారం తిన్నప్పుడు అందులోని చిన్న చిన్న ముక్కలు, నోట్లోని చనిపోయిన కణాలు, శ్లేష్మం వంటివి ఈ గుంతల్లో పేరుకుపోతుంటాయి. అలా పేరుకు పోయిన వ్యర్థాలపై బ్యాక్టీరియా చేరి, కాలక్రమేణా అవి గట్టిపడి తెలుపు లేదా పసుపు రంగులో చిన్న చిన్న రాళ్లుగా మారుతుంటాయి.

ఎవరికి ముప్పు ఎక్కువ..?

నోటి పరిశుభ్రత సరిగ్గా పాటించని వారికి, టాన్సిల్స్‌పై సహజంగానే లోతైన గుంతలు ఉన్నవారికి. తరచూ గొంతు ఇన్ఫెక్షన్ల (tonsillitis) బారిన పడేవారికి ఈ రాళ్లు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

తీవ్రమైన నోటి దుర్వాసన: టాన్సిల్ రాళ్లలోని బ్యాక్టీరియా సల్ఫర్ సమ్మేళనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల బ్రష్ చేసినా తగ్గని విపరీతమైన నోటి దుర్వాసన వస్తుంది. గొంతులో అసౌకర్యం.. నిరంతరం గొంతులో ఏదో నలుసు ఇరుక్కుపోయినట్లు అనిపించడం, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉండటం, తరచూ దగ్గు రావడం జరుగుతుంది.అద్దంలో గొంతు లోపలి భాగాన్ని పరిశీలిస్తే.. టాన్సిల్స్‌పై తెల్లటి లేదా పసుపు రంగు చుక్కల్లాంటి రాళ్లు అతుక్కుని ఉండటం కనిపిస్తుంది. గొంతు, చెవికి సంబంధించిన నరాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ ప్రభావంతో కొంతమందికి చెవి నొప్పి కూడా రావచ్చు.

నివారణ మార్గాలు..

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడంతో పాటు, నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం (Tongue Cleaning) ఎంతో ముఖ్యం. దీనివల్ల నోట్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. ప్రతిరోజూ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించడం (Gargling) అలవాటు చేసుకోవాలి. ఇది టాన్సిల్స్ గుంతల్లో ఇరుక్కున్న ఆహార కణాలను బయటకు పంపడానికి అద్భుతంగా సహాయపడుతుంది. నోరు ఎండిపోతే బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. కాబట్టి రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ నోటిని తేమగా ఉంచుకోవాలి.

ధూమపానం తగ్గించడం, చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలకు దూరంగా ఉండటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. పదే పదే గొంతు ఇన్ఫెక్షన్లు వస్తున్నా, ఈ రాళ్ల సమస్య ఎక్కువగా ఉన్నా సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన ఈఎన్‌టీ (ENT) వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం..!

 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.