Drinking Green Tea : గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా..? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!
సాక్షి లైఫ్ : అధిక బరువు, ఊబకాయం.. నేడు చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. బరువు పెరగడం వల్ల కీళ్ల నొప్పులే కాకుండా మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుందని వైద్యులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆశ్రయించే మార్గం 'గ్రీన్ టీ'. అయితే, ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా, కనీస వ్యాయామం చేయకుండా కేవలం గ్రీన్ టీ తాగితే సన్నబడతారా..? వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
అదొక 'మ్యాజిక్' పానీయం కాదు..!
సోషల్ మీడియా ప్రభావంతో గ్రీన్ టీ తాగితే సులభంగా బరువు తగ్గుతారనే అపోహ చాలామందిలో నెలకొంది. జిమ్ ట్రైనర్లు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దీనినే ప్రచారం చేస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే 'కాటెచిన్స్' కొవ్వును కరిగించడానికి కొంతమేర సాయపడతాయన్న మాట వాస్తవమే అయినా.. గ్రీన్ టీ అద్భుతాలు చేసే పానీయమేమీ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బరువు ఎందుకు తగ్గరు అంటే..?
బరువు తగ్గడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు. దీనికి నిరంతర శ్రమ, జీవనశైలి మార్పులు అవసరం. అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తాగుతూ..కనీస శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేస్తూ.. సరైన నిద్ర లేకుండా గ్రీన్ టీలు ఎన్ని తాగినా బరువు మాత్రం తగ్గలేరని నిపుణులు తేల్చి చెబుతున్నారు. బరువు తగ్గాలంటే మనం తీసుకునే కేలరీల కంటే, ఖర్చు చేసే కేలరీలు ఎక్కువగా (Caloric Deficit) ఉండాలి.
మోతాదు మించితే ముప్పే..!
బరువు త్వరగా తగ్గాలనే అత్యాశతో గ్రీన్ టీని పదే పదే తాగడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ, నిద్రలేమి, ఆందోళన వంటి కొత్త సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం 'ఐరన్'ను గ్రహించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
గ్రీన్ టీ అసలు ఎలా సాయపడుతుంది..?
గ్రీన్ టీలో ఉండే కెఫిన్, కాటెచిన్స్ శరీర జీవక్రియను (Metabolism) కాస్త పెంచుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శక్తిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అయితే, సరైన ఆహారం, వ్యాయామం తోడైతేనే గ్రీన్ టీ ఇచ్చే ఈ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుతాయి.
బరువు తగ్గాలంటే ఇవి తప్పనిసరి..
మీ దినచర్యలో గ్రీన్ టీతో పాటు పలు మార్పులు చేసుకుంటేనే ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.
వ్యాయామం..
రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వారంలో రెండు, మూడు రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి.
ఆహారం..
పీచు పదార్థాలు ఉండే తృణధాన్యాలు, ప్రోటీన్లు, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
వీటికి దూరంగా ఉండాలి..
ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట భోజనం త్వరగా ముగించాలి. నిద్ర, ఒత్తిడి.. బరువు తగ్గడంలో కంటినిండా నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి చాలా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
