Nutritious Meal : వండే పని లేకుండానే..! 10 నిమిషాల్లోనే పౌష్టికాహారం..
సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం అల్పాహారం తయారు చేయడానికి సమయం దొరకడం లేదా? దీంతో మార్కెట్లో దొరికే రెడీమేడ్, ప్యాక్డ్ ఫుడ్స్ (Packaged foods) వైపు మొగ్గు చూపుతున్నారా..? అయితే ఆ అలవాటు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉండే అధిక చక్కెర, కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆకలి తీర్చకపోగా, అనారోగ్యాలకు దారి తీస్తాయి. వంట గదిలో పొయ్యి వెలిగించే శ్రమ లేకుండా, కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే హై ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంచుతాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
1. పోషకాల గని.. పెసర మొలకల సలాడ్..
పెసర మొలకలలో ప్రోటీన్లు, పీచుపదార్థం (fiber), విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
తయారీ విధానం..
ఒక గిన్నెలో గుప్పెడు పెసర మొలకలు తీసుకుని, దానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కీరదోస ముక్కలు కలపాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా చల్లుకోవాలి. మరింత రుచిగా ఉండాలంటే కొన్ని వేయించిన పల్లీలు (వేరుశెనగలు) జతచేసుకుంటే సరిపోతుంది.
2. సంప్రదాయ రుచి.. పెరుగు - అటుకులు..
అటుకులు, పెరుగు కలయిక ఎంతో సులభమైన, సాంప్రదాయకమైన అల్పాహారం. ఇందులో ప్రోటీన్లతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేసే గుణాలు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.
తయారీ విధానం..
అటుకులను శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కమ్మటి పెరుగు కలపాలి. తీపి ఇష్టపడేవారు తగినంత బెల్లం లేదా పంచదార కలుపుకోవచ్చు. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్, గింజలు చల్లుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది.
3. చలవ చేసే.. సత్తు పానీయం..
శరీరానికి కావలసిన ప్రొటీన్లను తక్షణమే అందించే అద్భుతమైన పానీయం 'సత్తు'. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడంలో దీనికిదే సాటి.
తయారీ విధానం..
ఒక గ్లాసు నీటిలో తగినంత సత్తు పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా నల్ల ఉప్పు కలుపుకోవాలి. తీపి కావాలనుకునే వారు ఉప్పుకు బదులుగా బెల్లం లేదా తేనె కలుపుకొని తాగవచ్చు.
4. శక్తినిచ్చే.. చియా సీడ్స్ పుడ్డింగ్..
చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
తయారీ విధానం..రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలలో చియా గింజలను నానబెట్టుకోవాలి. ఉదయం ఆ మిశ్రమానికి అరటిపండు, బెర్రీల ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కలుపుకొని తింటే అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
5. శాకాహారుల బలం.. పనీర్ వెజ్ శాండ్‌విచ్..
శాకాహారులకు పనీర్ మంచి ప్రోటీన్ వనరు. ఉదయం హడావిడిలో అత్యంత సులభంగా, వేగంగా తయారు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇదొకటి.
తయారీ విధానం..
రెండు బ్రెడ్ స్లైస్‌ల మధ్య మందపాటి పనీర్ ముక్కలను ఉంచాలి. దానికి టమాటా, కీరదోస ముక్కలు, పాలకూర లేదా లెట్యూస్ ఆకులను జతచేయాలి. రుచి కోసం పైన కొద్దిగా చాట్ మసాలా, నల్ల మిరియాల పొడి చల్లుకుంటే పోషకాలతో నిండిన పనీర్ శాండ్‌విచ్ రెడీ. ఈ అల్పాహారాలు తయారు చేసే సమయం లేని వారికి, బ్యాచిలర్స్‌కి, ఉద్యోగులకు ఎంతో అనువైనవి. సమయం ఆదా కావడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
