Full-Body CT Scanner : వైద్య రంగంలో విప్లవం తెచ్చిన 'ఫుల్ బాడీ సీటీ స్కానర్' ఆవిష్కరణ వెనక కథ..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వైద్యుడు చర్మంపై ఒక్క చిన్న గాటు కూడా పెట్టడు.. రక్తం చుక్క చిందదు.. కానీ నిమిషాల వ్యవధిలో మీ శరీరంలో ఎక్కడ ఏ ఎముక విరిగిందో, మెదడులో ఎక్కడ రక్తం గడ్డకట్టిందో, ఏ అవయవంలో ట్యూమర్ దాగి ఉందో స్క్రీన్ మీద స్పష్టంగా చూపిస్తాడు. ఈ అద్భుతాన్నే మనం 'సీటీ స్కాన్' (CT Scan) అని పిలుస్తున్నాం. నేడు అత్యవసర వైద్యంలో ప్రాణాలను కాపాడే అత్యంత కీలకమైన సాధనంగా ఇది మారింది. అయితే, కోట్లాది మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్న ఈ విశిష్ట సాంకేతికత వెనుక ఉన్న మేధావి ఎవరో, ఆయన ప్రస్థానం ఎలా సాగిందో మీకు తెలుసా..?

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

 

ఆధునిక డయాగ్నోస్టిక్ ఇమేజింగ్, 'మెడికల్ ఇన్ఫర్మాటిక్స్' పితామహుడిగా పిలిచే అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ లెడ్లీ (Robert Ledley) ప్రపంచానికి అందించిన అపురూప కానుక ఇది. ఆయన రూపొందించిన మొట్టమొదటి హోల్ బాడీ సీటీ స్కానర్ వైద్య చరిత్ర గమనాన్నే మార్చేసింది.

దంత వైద్యుడి నుంచి ఫిజిక్స్ పరిశోధకుడి వరకు..

జూన్ 28, 1926న న్యూయార్క్‌లో జన్మించిన రాబర్ట్ లెడ్లీ విద్యాభ్యాసం చాలా ఆసక్తికరంగా సాగింది. ఆయన సాధారణ వైద్యుడిలా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ (Physics) అభ్యసించిన ఆయన, ఆ తర్వాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి డెంటిస్ట్రీ (Dentistry) పట్టా పుచ్చుకున్నారు. అయితే సైన్స్ గ్రంథాలపై ఉన్న మక్కువతో తిరిగి కొలంబియా విశ్వవిద్యాలయానికి చేరుకుని సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.

ఆయన కెరీర్ ప్రారంభంలో అమెరికన్ ఆర్మీలో డెంటిస్ట్‌గా సేవలందించారు. కొరియా యుద్ధ సమయంలో ఆర్మీ ‘డెంటల్ కోర్’లో ఉంటూ కృత్రిమ దంతాల రూపకల్పనపై విస్తృత పరిశోధనలు చేశారు. దంతాల నిర్మాణం, ఆహారాన్ని నమలడం వెనుక ఉన్న మెకానిజంను కూడా ఆయన ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఫార్ములాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారంటే ఆయన ఆలోచనా సరళి ఎంత భిన్నంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

కంప్యూటర్లకు వైద్యం నేర్పిన వేళ..

1950వ దశకంలో కంప్యూటర్లు ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న రోజుల్లోనే రాబర్ట్ లెడ్లీ భవిష్యత్తును ముందుగానే ఊహించారు. రాబోయే రోజుల్లో ఈ భారీ యంత్రాలు వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేస్తాయని ఆయన బలంగా నమ్మారు.

1959లో ఆయన ప్రచురించిన 'రీజనింగ్ ఫౌండేషన్ ఆఫ్ మెడికల్ డయాగ్నోసిస్' అనే పరిశోధనా పత్రం వైద్య ప్రపంచంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. రోగుల వ్యాధులను ఖచ్చితంగా గుర్తించడంలో కంప్యూటర్లు వైద్యులకు అద్భుతంగా సహాయపడగలవనే సరికొత్త ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఆయనే. దీని నుంచే నేటి 'మెడికల్ ఇన్ఫర్మాటిక్స్' అనే విభాగం పుట్టుకొచ్చింది.

ప్రపంచపు మొట్టమొదటి ఫుల్ బాడీ సీటీ స్కానర్.. 

రాబర్ట్ లెడ్లీ జీవితంలోనే అతిపెద్ద విజయం 1973లో సాకారమైంది. ఆయన 'ACTA' (ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ట్రాన్స్‌వర్స్ యాక్సియల్) పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్-బాడీ సీటీ స్కానర్‌ను ఆవిష్కరించారు. ఈ యంత్రం వైద్య రంగంలో అప్పట్లో ఒక సంచలనం. ఎందుకంటే అంతవరకు శరీరంలోని అంతర్గత భాగాలను త్రీ డైమెన్షనల్ (3D) క్రాస్-సెక్షనల్ చిత్రాలుగా చూడటం సాధ్యపడలేదు. ఈ ఒక్క ఆవిష్కరణతో బ్రెయిన్ స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం, క్యాన్సర్ ట్యూమర్లు, గుండె జబ్బులను ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే ప్రాథమిక దశలోనే గుర్తించడం సులువైంది. నేటి ఆధునిక ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్ ఇంత వేగంగా స్పందిస్తోందంటే దానికి పునాది లెడ్లీ కనుగొన్న ఈ సాంకేతికతే.

చెరిగిపోని వారసత్వం.. దక్కిన గౌరవాలు.. 

రాబర్ట్ లెడ్లీ చేసిన ఈ ఆవిష్కరణ ఎంత చారిత్రాత్మకమైనదంటే, ఆయన తయారుచేసిన మొట్టమొదటి సీటీ స్కానర్‌ను నేటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక 'స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ'లో భద్రపరిచారు. జూలై 24, 2012న ఈ లోకాన్ని విడిచివెళ్లిన ఈ మహోన్నత శాస్త్రవేత్త తన జీవితకాలంలో 300కు పైగా పరిశోధనా పత్రాలను రాశారు. 10కి పైగా పేటెంట్లను సాధించారు.

వైద్య రంగానికి ఆయన చేసిన అనన్యసామాన్య సేవలకు గాను అనేక అత్యున్నత పురస్కారాలు ఆయన్ను వరించాయి. 

1990..'నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు.

1994..ప్రతిష్టాత్మక 'IEEE మెడికల్ ఇంజనీరింగ్ అవార్డు'.

1997.. అమెరికా అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటైన 'నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' పురస్కారం. ఒక రోగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరినప్పుడు, లోపల ఏం జరిగిందో క్షణాల్లో కనిపెట్టి ప్రాణాలు నిలుపుతున్న ప్రతి సీటీ స్కాన్ వెనుక ఒక డెంటిస్ట్ ఆలోచన, ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త కృషి దాగున్నాయనేది నిజంగా అద్భుతమైన విషయం..!

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.