వయస్సుతో కాదు, జీవనశైలితోనే 'దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ '.. అధ్యయనంలో సంచలన విషయాలు.. !

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీరు వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలో ఇన్ఫ్లమేషన్, నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా? దీనికి కారణం కేవలం మీ వయస్సు కాకపోవచ్చని, అందుకు మీ జీవనశైలి కూడా కారణం కావచ్చని తాజా ఓ అధ్యయనం వెల్లడించింది. 'నేచర్ ఏజింగ్' అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం, "ఇన్‌ఫ్లమ్మింగ్" (Inflamming) అనే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కేవలం వయసుతో వచ్చే సమస్య కాదని, ఆధునిక జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ముఖ్య కారణమని పేర్కొంది.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

అధ్యయనంలో కీలక అంశాలు.. 

కొలంబియా యూనివర్శిటీలోని పరిశోధకులు ఇటలీ, సింగపూర్ వంటి పారిశ్రామిక దేశాల్లోని వృద్ధులను, అలాగే బొలీవియాలోని ట్సిమానే, మలేషియాలోని ఒరాంగ్ అస్లీ వంటి సంప్రదాయ జీవనశైలిని అనుసరించే ఆదివాసీ తెగలను పోల్చి చూశారు. ఈ పోలికలో ఆసక్తికరమైన తేడాలు కనిపించాయి.

పారిశ్రామిక దేశాల్లో: వయసు పెరిగే కొద్దీ ఈ దేశాల ప్రజల్లో సి-రియాక్టివ్ ప్రోటీన్స్ (CRP), ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ వంటి ఇన్ఫ్లమేషన్ ను సూచించే మార్కర్లు గణనీయంగా పెరిగాయి. ఇవి గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎక్కువగా ముడిపడి ఉన్నాయి.

సంప్రదాయ తెగల్లో.. ఈ ఆదివాసీ తెగలకు అంటువ్యాధుల కారణంగా తరచుగా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పటికీ, అది వయసుతో పాటు పెరగలేదు. అంతేకాకుండా, వారికి దీర్ఘకాలిక వ్యాధులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

"ఇన్ఫ్లమేషన్ అనేది వయస్సు పెరగడం వల్ల వచ్చేది కాదు, మన జీవనశైలి, పారిశ్రామిక వాతావరణానికి శరీరం ఇచ్చే ఒక రకమైన ప్రతిస్పందన మాత్రమే" అని పరిశోధకుడు డాక్టర్ అలెన్ కోహెన్ వివరించారు. ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యం వయస్సు మీద ఆధారపడలేదు, కానీ మనం ఎలా జీవిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం మన ఆహారం, శారీరక శ్రమ, విశ్రాంతి వంటి వాటిని సరిగా చూసుకోవడం చాలా అవసరం.

 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.