Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భవిష్యత్తులో మన ఆరోగ్యం ఎలా ఉంటుంది..? మనం ఎంతకాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తాం..? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే, భారీగా ఖర్చుపెట్టి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోకుండానే, ఇంట్లోనే కుర్చీ లాంటి సాధారణ వస్తువులతో చేసే కొన్ని చిన్నపాటి ఫిట్‌నెస్ టెస్ట్‌ల ద్వారా మన ఆయుష్షును అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఏదో కల్పిత కథ కాదు, శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనం ద్వారా ధృవీకరించిన వాస్తవం. శరీర సమతుల్యత (body balance), కండరాల బలం, వశ్యత (flexibility), చురుకుదనం కేవలం ఒక వ్యక్తి ఫిట్‌నెస్‌ను మాత్రమే కాదు, వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని, దీర్ఘకాలం జీవించే అవకాశాలను కూడా తెలియజేస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

 

అధ్యయనం ఏం చెబుతోంది అంటే..?

తైవాన్‌లోని 'చుంగ్ యువాన్ క్రిస్టియన్ యూనివర్సిటీ' పరిశోధకులు 13 వేల మందికి పైగా సగటు వయసు 73 ఏళ్లు కలిగిన వృద్ధులపై ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ప్రముఖ వైద్య పత్రిక 'జామా నెట్‌వర్క్ ఓపెన్' (JAMA Network Open)లో ప్రచురితమైంది. ఏడు రకాల శారీరక సామర్థ్య పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిలో, కొన్ని కారణాలతో మరణించే ప్రమాదం (All-cause mortality) చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

ఆ 7 సింపుల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు ఇవే..

గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాల బలం, ఫ్లెక్సిబిలిటీని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు7 మార్గాలను సూచించారు.

రెండు నిమిషాల నడక (Step Test)..

గుండె, ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను ఎంత బాగా వినియోగించుకుంటు న్నాయో తెలుసుకోవడానికి, రెండు నిమిషాల వ్యవధిలో మీరు ఎన్ని అడుగులు వేయగలరో గమనించండి.

30 సెకన్ల బైసెప్ కర్ల్స్ (Bicep Curls)..

 చేతుల కండరాల బలాన్ని అంచనా వేయడానికి, 30 సెకన్ల పాటు  డంబెల్స్ లేదా నీళ్ల బాటిల్స్ వంటి బరువులను ఎన్నిసార్లు పైకి ఎత్తి దించగలరో పరీక్షించండి.

కుర్చీలోంచి లేచి కూర్చోవడం (Chair Stand)..

 30 సెకన్ల వ్యవధిలో కుర్చీలోంచి ఎన్నిసార్లు లేచి మళ్లీ కూర్చోగలరో చూడాలి. ఇది కాళ్లు, శరీర కింది భాగం బలాన్ని సూచిస్తుంది.

చేతులను వీపు వెనక్కి తీసుకెళ్లడం (Back Scratch Test)..

 శరీర జాయింట్ల వశ్యతను తెలుసుకోవడానికి, చేతులను వీపు వెనుకకు ఎంత దూరం, ఎంత సులభంగా తీసుకెళ్లగలరో పరీక్షించుకోవాలి.

కాలి వేళ్లను తాకడం (Sit-and-Reach)..

 కింద కూర్చుని, కాళ్లను చాపి, వంగి చేతులతో కాలి వేళ్లను ఎంత సులభంగా తాకగలరో చూడాలి.

ఒంటి కాలిపై నిలబడటం (One-Leg Stance)..

శరీర సమతుల్యత (బ్యాలెన్స్)ను అంచనా వేయడానికి, ఒక కాలిపై కింద పడకుండా ఎంత సేపు స్థిరంగా నిలబడగలరో గమనించాలి.

8 అడుగుల నడక (8-Foot Up-and-Go)..

కుర్చీలోంచి లేచి 8 అడుగుల దూరం నడిచి, తిరిగి వచ్చి మళ్లీ కూర్చోవడానికి ఎంత సమయం పడుతుందో రికార్డ్ చేయాలి. ఇది శరీర చురుకుదనాన్ని, నియంత్రణను తెలుపుతుంది.

ఫలితాలు.. ఏ టెస్ట్ పాస్ అయితే ఎంత ఆయుష్షు..?

ఈ ఏడు పరీక్షల ఫలితాలను విశ్లేషించిన పరిశోధకులు ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించారు.

వేగంగా నడిచేవారు.. కుర్చీలోంచి లేచి 8 అడుగులు అత్యంత వేగంగా నడిచి వచ్చిన వారిలో 7 ఏళ్ల అధ్యయన కాలంలో చనిపోయే ప్రమాదం59 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.

బెస్ట్ బ్యాలెన్స్.. ఒంటి కాలిపై అత్యుత్తమంగా బ్యాలెన్స్ చేసిన వారిలో మరణ ప్రమాదం 50 శాతం మేర తగ్గింది.

కుర్చీ స్టాండ్స్.. 30 సెకన్లలో కుర్చీలోంచి ఎక్కువసార్లు లేచి కూర్చున్న వారిలో ఈ ముప్పు 45 శాతం తక్కువగా నమోదైంది.

ఓవరాల్ ఫిట్‌నెస్ విషయంలో.. ఈ ఏడు పరీక్షల్లోనూ మంచి స్కోరు సాధించిన 'బెస్ట్ ఫిట్' వ్యక్తులు, అతితక్కువ స్కోరు సాధించిన వారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ కాలం జీవించే అవకాశం 61 శాతం అధికంగా ఉందని నిపుణులు గుర్తించారు.


వృద్ధాప్యంలో కింద పడటం అనేది అత్యంత తీవ్రమైన సమస్య. దీనివల్ల ఎముకలు విరగడం మొదలుకొని ప్రాణాపాయం వరకు జరగవచ్చు. ఒంటి కాలిపై బ్యాలెన్స్ చేయగలగడం, వేగంగా నడవగలగడం అనేది మెదడుకు, కండరాలకు మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయాన్ని (Neuromuscular control) సూచిస్తుందని, అలాంటి వారు కింద పడే ప్రమాదం చాలా తక్కువని వైద్యులు వివరిస్తున్నారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా నిత్యం శారీరకంగా చురుకుగా ఉండటం దీర్ఘాయుష్షుకు అసలైన రహస్యం.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.