HDL2 : హంటింగ్టన్ డిసీజ్-లైక్ 2 అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : మానసిక స్థితి, ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు ఒక్కోసారి తీవ్రమైన మెదడు వ్యాధులకు సంకేతం కావచ్చని కాలిఫోర్నియాకు చెందిన 36 ఏళ్ల డేమియన్ లుజాన్ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఎప్పుడూ పొదుపుగా ఉండే ఆయనలో కోపం, గేమింగ్ వ్యసనం, విపరీతమైన ఖర్చు వంటి లక్షణాలు చివరకు 'హంటింగ్టన్ డిసీజ్-లైక్ 2' (HDL-2) అనే అత్యంత అరుదైన వ్యాధిగా నిర్ధారణ అయ్యాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఆకస్మిక మార్పులతో..
డేమియన్ స్వతహాగా చాలా పొదుపరి. కానీ అకస్మాత్తుగా మొబైల్ గేమ్ 'క్యాండీ క్రష్' కోసం నెలకు ఏకంగా 1,000 డాలర్లు అంటే సుమారు రూ. 84 వేలు ఖర్చు చేయడం ప్రారంభించాడు. పిల్లల కోసం దుస్తులు కొనడానికి వెళ్లి, అనూహ్యంగా తన కోసమే 900 డాలర్లు అంటే సుమారు రూ. 75 వేలు బట్టలు కొనేశాడు. చిన్న విషయాలకే విపరీతమైన కోపం, చిరాకు పడటం, ఆవేశంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తరచూ ఉద్యోగాలు మానేస్తూ కుటుంబానికి దూరం అవుతున్నట్లు ప్రవర్తించాడు. కొంతకాలానికి కుడి చేతిలో వణుకు రావడం, నడిచేటప్పుడు కుడి కాలు ఈడ్చుకుంటూ వెళ్లడం వంటి శారీరక లక్షణాలు కూడా కనిపించాయి.
వ్యాధి నిర్ధారణలో సవాళ్లు..
కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా, ఆయా లక్షణాల ఆధారంగా మూడుసార్లు హంటింగ్టన్ వ్యాధి పరీక్షలు చేశారు. ఆశ్చర్యకరంగా మూడుసార్లూ నెగెటివ్ వచ్చింది. సుదీర్ఘ పరీక్షల అనంతరం ఇది అత్యంత అరుదైన 'హంటింగ్టన్ డిసీజ్-లైక్ 2 (HDL-2)' అని తేల్చారు. ప్రధానంగా ఆఫ్రికన్ సంతతి వ్యక్తుల్లో కనిపించే ఈ వ్యాధి లక్షణాలు సాధారణ హంటింగ్టన్ వ్యాధిని పోలి ఉంటాయి.
హంటింగ్టన్ (HDL-2) అంటే ఏమిటి..?
ఇది మెదడులోని ఫ్రంటల్ లోబ్‌పై తీవ్ర ప్రభావం చూపే అరుదైన జన్యుపరమైన వ్యాధి. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతినడం వల్లే డేమియన్ విపరీతంగా ఖర్చు చేయడం, కోపానికి గురికావడం జరిగింది.
తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి కారక జన్యువు ఉంటే, పిల్లలకు సోకే ముప్పు 50 శాతం వరకు ఉంటుంది. దీనికి పూర్తి స్థాయి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు మొదలైన తర్వాత రోగి 10 నుంచి 20 ఏళ్ల పాటు జీవించే అవకాశం ఉంటుందని వైద్యులు అంచనా వేస్తారు.
తలకిందులైన జీవితం..
ఒకప్పుడు ఎంతో చురుకుగా ఉండే డేమియన్, ఇప్పుడు కనీసం ఇంటి బయట అడుగుపెట్టలేని స్థితికి చేరుకున్నాడు. దారి మర్చిపోతాడనే భయంతో రోడ్డుపైకి ఒంటరిగా వెళ్లలేడు. ఆయన భార్య యోలాండా ఇప్పుడు తన నలుగురు పిల్లల బాధ్యతతో పాటు, భర్త బాగోగులు చూసుకుంటూ కుటుంబ భారాన్ని మొత్తం మోస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
