Fatty Liver : ఫ్యాటీ లివర్‌ను తరిమికొట్టే అద్భుతమైన టానిక్.. నిపుణులు ఏమంటున్నారంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మానవ శరీరంలో అత్యంత కీలకమైన, నిరంతరం విశ్రాంతి లేకుండా పనిచేసే అవయవం కాలేయం (liver). అయితే, మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయ సమస్యలు, ముఖ్యంగా 'ఫ్యాటీ లివర్' బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సకాలంలో గుర్తించి, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ సమస్యను సులభంగా అదుపు చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..

 

అసలు సమస్య ఏమిటి..?

ఆహారంలోని పోషకాలను విచ్ఛిన్నం చేయడం, శరీరానికి అవసర మైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం, ఔషధాల జీవక్రియ, జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కాలేయం పాత్ర ఎంతో కీలకం. అయితే, ప్రారంభ దశలో కాలేయ సమస్యలకు సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపించవు. ఆరోగ్య పరీక్షల సమయంలో కాలేయ ఎంజైమ్‌లు పెరగడం లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మాత్రమే ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు.

ముప్పు పెంచుతున్న MASLD..

గతంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)గా పిలిచే ఈ సమస్యను, ఇప్పుడు వైద్య పరిభాషలో మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు.

కారణాలు..? 

ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో లిపిడ్ స్థాయిలు అసాధారణంగా ఉండటం వల్ల కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది.

ప్రమాదం..

సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది కాలేయ వాపు, లివర్ ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్‌కు దారి తీస్తుంది.

కాలేయానికి 'బ్లాక్ కాఫీ' బెస్ట్ టానిక్..  

ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెట్టడంలో పంచదార, పాలు కలపని 'బ్లాక్ కాఫీ' అద్భుతంగా పనిచేస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రష్మీ నిరంజన్ చెబుతున్నారు. ఇది కాలేయానికి అత్యుత్తమ టానిక్ లాంటిది.

 అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లివర్ డిసీజెస్ మార్గదర్శకాలు, పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు 2-3 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల క్రానిక్ లివర్ డిసీజ్, ఫైబ్రోసిస్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.

ఎలా పనిచేస్తుంది..?

 కాఫీలో కెఫిన్‌తో పాటు పాలీఫెనాల్స్, ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయ ఎంజైమ్‌లను మెరుగుపరచి, వ్యాధి లక్షణాలను తగ్గిస్తాయి.

ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి.. 

కేవలం కాఫీ మాత్రమే కాదు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దైనందిన ఆహారంలో పోషక విలువలున్న పదార్థాలను చేర్చుకోవాలి.

ఫైబర్ ఫుడ్..

 తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోని ఫైబర్ శరీర బరువును, జీవక్రియను అదుపులో ఉంచుతుంది.

నట్స్, సీడ్స్..  

డ్రై ఫ్రూట్స్, గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను, పోషకాలను అందిస్తాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. 

చేపలు, వాల్‌నట్స్ వంటివి గుండెతో పాటు మెటబాలిక్ ఆరోగ్యానికి, కాలేయానికి అత్యంత ప్రయోజనకరం. వంటల్లో ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను మితంగా వాడటం కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.