Beat Anemia : రక్తహీనతకు చెక్..: ఐరన్ పెరగాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే..!

షేర్ చేయండి:
Beat Anemia : రక్తహీనతకు చెక్..: ఐరన్ పెరగాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే..!

సాక్షి లైఫ్ : నేటి కాలంలో ఐరన్ (iron) లోపం, దానివల్ల కలిగే రక్తహీనత (anemia) ఒక సాధారణ సమస్యగా మారాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు విపరీతమైన అలసట, తలతిరగడం, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి వంటి లక్షణాలు వేధిస్తాయి.

చాలా మంది హిమోగ్లోబిన్ స్థాయిలను(hemoglobin levels) పెంచుకోవడానికి కేవలం ఐరన్ టాబ్లెట్లపైనే ఆధారపడుతుంటారు. అయితే, మనం తినే కొన్ని రకాల ఆహార అలవాట్లు శరీరంలో ఐరన్ శోషణను (Absorption) అడ్డుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి వేటిని దూరం పెట్టాలి, వేటిని ఆహారంలో చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి.. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?

 

1. భోజనం తర్వాత టీ, కాఫీలకు నో..!

చాలా మందికి తిన్న వెంటనే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, వీటిలో ఉండే ‘టానిన్లు’, ‘కెఫిన్’ అనే సమ్మేళనాలు మనం తిన్న ఆహారం నుంచి ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. వీటికి బదులుగా కొబ్బరినీళ్లు, నిమ్మరసం, ఉసిరి రసం లేదా తాజా పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో మేలు. వీటిలో ఉండే విటమిన్ ‘సి’ శరీరానికి ఐరన్‌ను వేగంగా అందించడంలో సహాయపడుతుంది.

2. జంక్ ఫుడ్‌కు దూరంగా..

పిజ్జాలు, బర్గర్లు, బేకరీ తిండ్లు, ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్స్ శరీరానికి కేవలం ‘శూన్య కేలరీలను’ (Empty Calories) మాత్రమే ఇస్తాయి తప్ప ఎలాంటి పోషకాలను అందించవు. ఇవి ఐరన్ లోపాన్ని మరింత తీవ్రం చేస్తాయి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పప్పుధాన్యాలు, శనగలు, పాలకూర, తోటకూర, మెంతి వంటి ఆకుకూరలను రోజూ తీసుకోవాలి.

3. సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు వద్దు..

కార్బోనేటెడ్ పానీయాలు, కూల్‌డ్రింక్స్, సోడాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దాహం వేస్తే రసాయనాలతో కూడిన డ్రింక్స్ కాకుండా మజ్జిగ, పెరుగు లస్సీ, నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాక జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

4. మైదా ఉత్పత్తులకు గుడ్ బై..!

మైదా పిండితో తయారుచేసే వైట్ బ్రెడ్, బిస్కెట్లు, కేకులు వంటి బేకరీ ఉత్పత్తులలో పీచుపదార్థం (fiber), పోషకాలు అస్సలు ఉండవు. ఇవి క్రమంగా శరీరాన్ని బలహీనపరుస్తాయి. మైదాకు బదులుగా మల్టీగ్రెయిన్ పిండి, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి  తృణధాన్యాలతో చేసిన రొట్టెలను అలవాటు చేసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.

5. చక్కెర తగ్గించండి.. బెల్లం వాడండి..

అధికంగా స్వీట్లు, చక్కెర తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల నీరసం వస్తుంది తప్ప రక్తం ఊరదు. తీపి తినాలనిపిస్తే చక్కెరకు బదులు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, ఆర్గానిక్ బెల్లం వంటివి ఎంచుకోవాలి. ముఖ్యంగా బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య సహజంగా పెరుగుతుంది.

చిన్న మార్పు.. పెద్ద ఫలితం..!

రక్తహీనత సమస్యను కేవలం ఔషధాలతోనే కాకుండా, రోజువారీ ఆహార నియమాలలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా అధిగమించవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, దాని శోషణకు అడ్డుపడే పదార్థాలను నియంత్రించినప్పుడే హిమోగ్లోబిన్ శాతాన్ని సహజంగా పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన రక్తహీనత లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సొంత వైద్యానికి పోకుండా, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి..Vitamin B12 and Vitamin B9 Deficiency : భారతీయుల్లో వేగంగా పెరుగుతున్న విటమిన్ ‘బి12’, ‘విటమిన్ బి9’ లోపాలు..! కారణాలు ఏమిటంటే..? 

 ఇది కూడా చదవండి..Signs of Diabetes : చాలామంది పట్టించుకోని మధుమేహం ముందస్తు హెచ్చరికలు ఇవే..!

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.