Vitamin B12 and Vitamin B9 Deficiency : భారతీయుల్లో వేగంగా పెరుగుతున్న విటమిన్ ‘బి12’, ‘విటమిన్ బి9’ లోపాలు..! కారణాలు ఏమిటంటే..?
సాక్షి లైఫ్ : భారతీయులలో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రక్తహీనతను నివారించడంలో, మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించే విటమిన్ ‘బి12’ (Vitamin B12), ‘ఫోలేట్’ (Foilate - విటమిన్ బి9) లోపాలు దేశంలో ఒక ‘నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం’లా మారుతున్నాయని వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
దేశ జనాభాలో దాదాపు 47శాతం నుంచి 51శాతం మంది విటమిన్ బి12 లోపంతో, 37శాతం మంది ఫోలేట్ లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా కనిపించే నీరసం, తలతిరగడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
పురుషుల్లో అలసట.. మహిళల్లో నిరుత్సాహం..!
ఈ విటమిన్ల లోపం వల్ల పురుషులు, మహిళల శారీరక, మానసిక స్థితిగతులు ఎలా ప్రభావితమవుతాయనే అంశంపై జపాన్‌కు చెందిన ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రముఖ ‘న్యూట్రియెంట్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం..
హోమోసిస్టీన్ ముప్పు..
శరీరంలో బి12, ఫోలేట్ స్థాయిలు తగ్గినప్పుడు ‘హోమోసిస్టీన్’ అనే అమైనో ఆమ్లం (అమినో యాసిడ్) రక్తంలో ప్రమాదకరంగా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, పక్షవాతం (స్ట్రోక్), మతిమరుపు (డిమెన్షియా) ముప్పును పెంచుతుంది.
పురుషులపై ప్రభావం..
రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు పెరగడం వల్ల పురుషులలో తీవ్రమైన శారీరక అలసట, నీరసం వేధిస్తాయి.
మహిళలపై ప్రభావం..
మహిళల్లో ఇది మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. నిత్యం నిరుత్సాహంగా ఉండటం, ఏ పనిపైనా శ్రద్ధ లేదా ప్రేరణ (Motivation) లేకపోవడానికి ఈ పోషకాల లోపమే ప్రధాన కారణమని తేలింది.
గర్భిణులకు మరీ ముఖ్యం..
ఫోలేట్ (విటమిన్ బి9) కొత్త కణాల నిర్మాణానికి, రక్తం ఊరడానికి ఎంతో అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది అత్యంత కీలకం. గర్భస్థ పిండం, మెదడు, వెన్నుపాము సజావుగా అభివృద్ధి చెందడానికి ఫోలేట్ ఎంతో సహాయపడుతుంది. దీని లోపం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది.
లోపాన్ని అధిగమించడం ఎలా..?
శరీరంలో ఈ విటమిన్ల లోపాన్ని పూరించడానికి కేవలం మందులపైనే ఆధారపడకుండా, రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
విటమిన్ బి12 కోసం.. ఇది ఎక్కువగా జంతు సంబంధిత ఆహారంలో లభిస్తుంది. పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, మాంసం, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. శాకాహారులు వైద్యుల సలహాతో ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలు లేదా సప్లిమెంట్లు తీసుకోవచ్చు.
ఫోలేట్ (బి9) కోసం.. పాలకూర, తోటకూర, మెంతులు వంటి ఆకుకూరలు, బ్రోకలీ, శనగలు, చిక్కుళ్లు, కాయధాన్యాలు, వేరుశెనగలు మరియు నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. సుదీర్ఘ కాలంగా విపరీతమైన అలసట, కాళ్లలో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే.. సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
