ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యలను ఎలా నివారించాలంటే..?
సాక్షి లైఫ్ : చర్మ సమస్యలను ఇంటి చిట్కాలతోనే నివారించవచ్చు. సమస్య ప్రారంభంలో ఐతే ఈ టిప్స్ ను పాటించవచ్చు. కొబ్బరినూనె, కర్పూరం, వేపనూనె మొదలైనవి సాధారణ అలెర్జీలు లేదా ఇతర కారణాల వల్ల చర్మంపై కనిపించే దద్దుర్లు, దురద మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే మీరు వీటిని అప్లై చేస్తే లక్షణాలు తగ్గుముఖం పట్టవచ్చు.
ఒకవేళ ఏమాత్రం ప్రయోజనం లేకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్లు ఇచ్చిన మందులు, లోషన్లతో పాటు పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే త్వరగా ఆయా సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాదు చర్మ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం
సరైన దుస్తులు..
సమ్మర్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి. అందుకోసమే ఎండాకాలంలో చెమటను పీల్చుకునే, చర్మానికి గాలి తగిలేలా కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. సింథటిక్ బట్టలు లేదా బ్రోకేడ్ లేదా లేస్ ఉన్న బట్టలు చర్మంపై రాపిడి కలిగించడం లేదా చెమట పేరుకుపోయేలా చేయడం ద్వారా కూడా స్కిన్ ప్రాబ్లెమ్స్ పెరుగుతాయి. అందుకే ఈ రకమైన దుస్తులకు దూరంగా ఉండండి. అలాగే వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
బట్టలు, వస్తువులను వేరుగా ఉంచండి..
చర్మవ్యాధులు ఉన్న వారు చికిత్స తీసుకుంటున్నంత కాలం, వారు ఉపయోగించే ప్రతి వస్తువును వారు వినియోగించేవన్నిటినీ విడిగా ఉంచండి. ముఖ్యంగా తువ్వాలు, నేప్కిన్లు, లోదుస్తులు మొదలైన వాటిని విడిగా ఉంచడమేకాకుండా విడిగానే ఉతకాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా వృద్ధులు ఉన్నట్లయితే, వీలైనంత వరకు వారితో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించేందుకు ప్రయత్నించండి. ఇన్ఫెక్షన్ సమయంలో ఇతర వ్యక్తులతో దగ్గరగా ఉండకూడదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే వస్తువులను వాడకూడదు.
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో వేడి చేస్తోందా..? ఇది మీకోసమే..!
ముఖ్యంగా చికిత్స తీసుకునే వరకు ఇది కష్టంగా ఉండవచ్చు. కానీ సోకిన ప్రదేశంలో దురదగా అనిపించినా గోకకుండా ఉండడం మంచిది. ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ లక్షణాలు పెరగకుండా నిరోధించాలి. కాబట్టి గోకకుండా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే..? గోళ్లలో ఉండే దుమ్ము ,ధూళి ఈ సమస్య మరింతగా పెంచే ప్రమాదం ఉంది.
ఆభరణాల వల్ల చర్మ సమస్యలు..
లోహాలు, ఆభరణాలు మొదలైన వాటిని ఉపయోగించడం వల్ల కొన్ని చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మెడలో ధరించే గొలుసు, నెక్లెస్ లేదా చేతులకు ధరించే గాజులు కారణంగా చెమట పడుతుంది. తద్వారా చర్మ సంబంధిత సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం లేదా వెండి లోహాలతో చేసినవి కాకుండా ఇతర లోహాలతో తయారు చేసిన ఆభరణాల వల్ల చర్మంపై దద్దుర్లు ,దురద వంటివి రావొచ్చు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కావాలంటే..ఈ విత్తనాలు తినాలి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
