Pregnancy Complications : గర్భధారణ సమస్యలు.. భవిష్యత్తుకు ముప్పుగా మారొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భం దాల్చడం మహిళల జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. అయితే ఈ తొమ్మిది నెలల ప్రయాణం అనేక శారీరక, మానసిక మార్పులతో కూడుకున్నది. ఈ సమయంలో రక్తపోటు (blood pressure), చక్కెర స్థాయిలు (blood sugar levels) పెరగడం, ప్రసవానంతర కుంగుబాటు (postpartum depression) వంటి ఇబ్బందులు సాధారణమేనని చాలామంది సరిపెట్టుకుంటారు. కాన్పు పూర్తయ్యాక శిశువు సంరక్షణలోనే నిమగ్నమై, సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ గర్భధారణ సమయంలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలు కూడా భవిష్యత్తులో తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ప్రమాదముందని తాజా అంతర్జాతీయ వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

అధ్యయనం ఏం చెబుతోంది..?

ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం... కింగ్స్ కాలేజ్ లండన్ సహా పలు ప్రముఖ సంస్థల పరిశోధకులు సుమారు 14 లక్షల మందికి పైగా మహిళల ఆరోగ్య రికార్డులను సుదీర్ఘకాలం పాటు విశ్లేషించారు. గర్భధారణ సమయంలో సమస్యలు తలెత్తిన మహిళల్లో, తరువాతి జీవితంలో గుండెజబ్బులు, డయాబెటిస్, అధిక రక్తపోటు, మూత్రపిండాల (kidney) సమస్యల ముప్పు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. గర్భధారణ మధుమేహం (Gestational Diabetes)..గర్భధారణ సమయంలో షుగర్ స్థాయిలు పెరిగిన మహిళలకు భవిష్యత్తులో శాశ్వతంగా 'టైప్-2 డయాబెటిస్' వచ్చే ముప్పు దాదాపు 7 రెట్లు ఎక్కువ.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

ప్రీ-ఎక్లాంప్సియా..

అధిక రక్తపోటు, ప్రీ-ఎక్లాంప్సియా..ఆ సమయంలో బీపీ పెరగడం భవిష్యత్తులో క్రానిక్ హైపర్‌టెన్షన్‌కు దారితీసే అవకాశం 3 రెట్లు అధికం కాగా, మూత్రపిండాల సమస్యల ముప్పు రెట్టింపు అవుతోంది. ఇతర సమస్యలు..నెలలు నిండకుండానే కాన్పు జరగడం, గర్భస్రావం, పిండ ఎదుగుదల లోపాలు, ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటే మాయ ముందుగానే వేరుపడటం వంటి సమస్యలు కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మానసిక ఒత్తిడి..ప్రసవం తర్వాత వచ్చే తీవ్రమైన డిప్రెషన్‌ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే అది భవిష్యత్తు శారీరక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

కారణం ఏమిటి..?

గర్భధారణ సమస్యలే నేరుగా ఈ వ్యాధులకు కారణం కాకపోవచ్చు కానీ, ఒక మహిళ శరీరంలో అంతర్గతంగా ఉన్న బలహీనతలు లేదా జీవక్రియల లోపాలను గర్భధారణ సమయం బయటపెడుతుందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అంటే, భవిష్యత్తులో రాబోయే వ్యాధులకు గర్భధారణ సమయంలో కనిపించే లక్షణాలు ఒక ముందస్తు హెచ్చరిక లాంటివి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గర్భధారణ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా, ప్రసవం తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించకూడదు. క్రమం తప్పని తనిఖీలు.. గర్భధారణ సమయంలో షుగర్ లేదా బీపీ సమస్యలు ఎదుర్కొన్న మహిళలు ప్రసవానంతరం 6 నుంచి 12 వారాల వ్యవధిలో సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారి వార్షిక హెల్త్ చెకప్ అవసరం. ఆహార నియమాలు..ఉప్పు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెరలు తగ్గించి.. పీచు పదార్థాలు, ఆకుకూరలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సమతులాహారం తీసుకోవాలి.

బరువు నియంత్రణ.. 

ప్రసవానంతరం క్రమంగా సాధారణ బరువుకు చేరుకోవడానికి ప్రయత్నించాలి. అధిక బరువు డయాబెటిస్, గుండెజబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. వ్యాయామం.. వైద్యుల సలహాతో రోజువారీ నడక, యోగా లేదా ఇతర తేలికపాటి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాలి. మానసిక ఆరోగ్యం.. ప్రసవానంతరం తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి, విచారం వేధిస్తుంటే కుటుంబ సభ్యులతో పంచుకోవాలి, అవసరమైతే నిపుణుల కౌన్సెలింగ్ తీసుకోవాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. గర్భధారణ సమయంలోని సమస్యలను ముందస్తు హెచ్చరికగా భావించి జీవనశైలిని మార్చుకుంటే భవిష్యత్ ముప్పులను సమర్థంగా అడ్డుకోవచ్చు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.