Bone Weakness in Women : మహిళల్లో ఎముకల బలహీనత.. ఆ ముప్పు ఎప్పుడు ఎక్కువ..? నివారణ మార్గాలేంటి..?
సాక్షి లైఫ్ : పురుషులతో పోలిస్తే మహిళల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యల ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతు న్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించి న వ్యాధులు మహిళల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. వైద్య నివేదికల ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళల్లో 'ఆస్టియోపోరోసిస్' అంటే ఎముకల సాంద్రత తగ్గి గుల్లబారడం సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి..? ఎప్పుడు ముప్పు ఎక్కువ..?
ఎముకల దృఢత్వం క్రమంగా తగ్గిపోయి, అవి అత్యంత పెళుసుగా మారి చిన్న దెబ్బ తగిలినా విరిగిపోయే ప్రమాదం ఉన్న దీర్ఘకాలిక సమస్యే 'ఆస్టియోపోరోసిస్'. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ, ముఖ్యంగా 'మెనోపాజ్' అంటే రుతుస్రావం ఆగిపోయే దశ సమయంలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ఈ సమయంలో శరీరంలో 'ఈస్ట్రోజెన్' హార్మోన్ స్థాయి వేగంగా పడిపోతుంది. దీనివల్ల ఎముకల నష్టం వేగంగా జరిగి, వాటి సాంద్రత క్షీణిస్తుంది. బరువు, ఇతర కారణాలు: అధిక బరువు ఉన్న మహిళల్లో లేదా ముందు నుంచీ ఎముకల బలహీనత సమస్య ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
పోషకాహార లోపం, జీవనశైలి పాత్ర..
ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్-డి రెండు కళ్లు లాంటివి. ఎముకల నిర్మాణానికి కాల్షియం అత్యవసరం కాగా, ఆ కాల్షియాన్ని శరీరం గ్రహించేలా చేయడానికి విటమిన్-డి సహకరిస్తుంది. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో పాటు తగిన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ముప్పు త్వరగా చుట్టుము డుతుంది. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఎముకలను గుల్లబారిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైలెంట్ కిల్లర్.. జాగ్రత్తలు తప్పనిసరి..!
ఆస్టియోపోరోసిస్‌ను వైద్యులు 'సైలెంట్ డిసీజ్' అని పిలుస్తారు. ఎందుకంటే ప్రారంభ దశలో దీని లక్షణాలు బయటికి పెద్దగా కనిపించవు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఎముకలు విరిగిపోవడం లేదా వెన్నుపూస వంగిపోవడం వంటి మార్పులు కనిపిస్తేనే ఈ సమస్య బయటపడుతుంది. వయసు మీరుతున్న కొద్దీ, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు తగిన పరీక్షలు చేయించుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
