PCOS : పీఎంఓఎస్ అండాశయాలకే పరిమితమైన సమస్య కాదు.. ఇదొక జీవక్రియలలోపం..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS). అయితే, ఇది కేవలం సంతానోత్పత్తి లేదా అండాశయాలకు (ovaries) సంబంధించిన సమస్య మాత్రమే కాదని, శరీరంలోని మొత్తం జీవక్రియల వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆధునిక వైద్య పరిశోధనల ఆధారంగా దీని పేరును 'పాలిసిస్టిక్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్' (PMOS) గా మార్చారు.
ప్రధాన లక్షణాలు ఏమిటి..?
ముఖం, గడ్డం, ఛాతీపై ఎక్కువగా వెంట్రుకలు రావడం, అలాగే తలపై జుట్టు పల్చబడటం, తీవ్రమైన మొటిమలు. చర్మం నల్లబడటం: మెడ, చంకలు, గజ్జల వద్ద చర్మం మందంగా, నల్లగా మారడం. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం కష్టంగా మారడం. వరుసగా మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు రుతుక్రమం రాకపోవడం, లేదా వచ్చినప్పుడు అతిగా రక్తస్రావం కావడం. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆందోళన, డిప్రెషన్ దాదాపు 40-50% మందిలో, విపరీతమైన అలసట, మూడ్ స్వింగ్స్.
పేరు ఎందుకు మార్చారు..?
ఇప్పటివరకు దీనిని కేవలం అండాశయాలలో నీటి బుడగలు (cysts) గానే భావించేవారు. కానీ, పీఎంఓఎస్ అనేది 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' అంటే శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేకపోవడంతో ముడిపడి ఉన్న ఒక మల్టీ-ఆర్గాన్ డిజార్డర్. దీనివల్ల భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు (hypertension), గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో దీని తీవ్రతపై సరైన అవగాహన కల్పించడానికే ఈ కొత్త పేరును నిర్ధారించారు.
నివారణ, పరిష్కార మార్గాలు..
బరువు తగ్గడం: ప్రస్తుత శరీర బరువులో కనీసం 5శాతం నుంచి 10శాతం తగ్గడం వల్ల మెటబాలిక్, హార్మోన్ల సమస్యలు చాలా వరకు అదుపులోకి వస్తాయి. క్యాలరీలు తగ్గించి, పీచు పదార్థాలు (fiber), కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల అంటే అన్నం,రోటీ కంటే ముందుగా ప్రోటీన్లు, కూరగాయలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. చల్లార్చి వేడిచేసిన అన్నం (Resistant starch), సీడ్ సైక్లింగ్ వంటివి మేలు చేస్తాయి.
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి రోజూ ఏరోబిక్స్, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. కేవలం జీవనశైలి మార్పులే కాకుండా, డాక్టర్ సలహా మేరకు నెలసరిని క్రమబద్ధీకరించే హార్మోనల్ మందులు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే మెట్ ఫార్మిన్ (Metformin) లేదా బరువు తగ్గించే అధునాతన ఔషధాలను వాడాల్సి ఉంటుంది. సమస్యను కేవలం పైపైకి తగ్గించడం కాకుండా, మూలకారణమైన 'జీవక్రియల లోపాన్ని' సరిదిద్దడమే పీఎంఓఎస్ ప్రధాన లక్ష్యం.
