Demodex Mites : మన ముఖంపై తిరగాడే 'రహస్య అతిథులు': డెమోడెక్స్ మైట్స్ గురించి సైన్స్ ఏం చెబుతోంది అంటే..?
సాక్షి లైఫ్ : రోజూ అద్దంలో చూసుకునే ముఖంపై కంటికి కనిపించని సూక్ష్మ జీవుల ప్రపంచం ఒకటి విలసిల్లుతోందని మీకు తెలుసా..? రాత్రివేళల్లో మాత్రమే మేల్కొనే ఈ సూక్ష్మజీవులు ఇప్పుడు కాదు మనుషులతో వేల ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సహజంగా మనం ఉదయం నిద్రలేవగానే ముఖాన్ని ఎంతో శ్రద్ధగా కడుక్కుంటాం. ఖరీదైన క్రీములు, లోషన్లు వాడుతూ అందంగా మార్చుకోవాలనుకుంటాం..అయితే, ఎంత శుభ్రం చేసుకున్నా మన ముఖంపై నివసించే కొన్ని అతి సూక్ష్మజీవులను శాశ్వతంగా తొలగించడం సాధ్యం కాదు. అసలు వాటిని తొలగించాల్సిన అవసరం కూడా లేదని మైక్రోబయాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అవే డెమోడెక్స్ మైట్స్ (Demodex Mites).
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
సాలీళ్లు, పేలు వర్గానికి అంటే అరాక్నిడా కుటుంబం చెందిన ఈ సూక్ష్మజీవులు మానవ శరీరంలో భాగమైన చర్మ సూక్ష్మజీవ వ్యవస్థ (Skin Microbiome)లో కీలకమైన అతిథులు.
ఈ జీవుల ఆవాసం ఎక్కడ..?
మానవ చర్మంపై ప్రధానంగా రెండు రకాల డెమోడెక్స్ జాతులు జీవిస్తాయి..
1. డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ (Demodex folliculorum)..
ఇవి ప్రధానంగా వెంట్రుకల కుదుళ్లలో నివసిస్తాయి. ముక్కు, బుగ్గలు, నుదురు, గడ్డం, ముఖ్యంగా కనురెప్పల వెంట్రుకల వద్ద ఇవి ఎక్కువగా ఉంటాయి.
2. డెమోడెక్స్ బ్రెవిస్ (Demodex brevis)..
ఇవి కొద్దిగా చిన్నవిగా ఉండి, చర్మంలోని నూనెను ఉత్పత్తి చేసే సెబేషియస్ గ్రంథులు, కనురెప్పలలో ఉండే మీబోమియన్ గ్రంథుల లోపల నివాసం ఉంటాయి.
ఈ మైట్లకు కాంతి అంటే గిట్టదు. అందుకే పగటిపూట చర్మ రంధ్రాల లోపలే ఉంటూ, రాత్రిళ్లు చీకటి పడ్డాక ఉపరితలంపైకి వచ్చి సంచరిస్తాయి. చర్మం విడుదల చేసే సహజ నూనెలు, రాలిపోయే మృత చర్మ కణాలను (Dead Skin Cells) ఆహారంగా తీసుకుంటూ 14 నుంచి 18 రోజుల స్వల్ప జీవిత చక్రాన్ని గడుపుతాయి.
అందరి ముఖాలపై ఇవి ఉంటాయా..?
అవును. పుట్టిన వెంటనే శిశువుల చర్మంపై ఇవి ఉండవు. తల్లిదండ్రుల స్పర్శ, సంరక్షణ ద్వారా క్రమంగా బిడ్డ చర్మంపైకి చేరుతాయి. యుక్తవయస్సులో హార్మోన్ల మార్పుల వల్ల చర్మంలో నూనె గ్రంథులు చురుగ్గా మారినప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది. వయోజనుల్లో దాదాపు 100 శాతం మంది ముఖాలపై ఈ మైట్లు సహజంగానే జీవిస్తుంటాయి.
ఇవి ప్రమాదకరమా..? సమస్యలు ఎప్పుడు వస్తాయి..?
సాధారణ ఆరోగ్యవంతులలో ఈ మైట్లు ఎలాంటి హానీ కలిగించవు. మన రోగనిరోధక వ్యవస్థ వీటికి, శరీరానికి మధ్య సమతుల్యతను కాపాడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు లేదా చర్మంలో విపరీతంగా జిడ్డు పెరిగినప్పుడు వీటి సంఖ్య అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు..
డెమోడికోసిస్ (Demodicosis)..ముఖంపై ఎరుపుదనం, దురద, చర్మం పొలుసులుగా మారడం, మంట. రోసేసియా (Rosacea)..చర్మంపై రక్తనాళాలు ఉబ్బి ఎర్రటి దద్దుర్లు రావడం. బ్లెఫరైటిస్ (Blepharitis).. కనురెప్పల మొదళ్లలో తీవ్రమైన దురద, ఎరుపుదనం, తెల్లటి పొట్టు రాలడం, కళ్ల మంట.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
డెమోడెక్స్ మైట్లను చర్మం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయడం అసాధ్యం, అనవసరం కూడా. అయితే వీటి సంఖ్య హద్దు మీరకుండా ఉండేందుకు చర్మ నిపుణులు (Dermatologists) ఇచ్చే కొన్ని కీలక సూచనలు.. రోజుకు రెండుసార్లు మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ చర్మ రంధ్రాలను మూసివేసే (Pore-clogging) భారీ ఆయిల్ బేస్డ్ క్రీములను మితంగా వాడాలి.
టీ ట్రీ ఆయిల్ వంటి గాఢమైన పదార్థాలను నేరుగా కళ్ల వద్ద లేదా ముఖంపై వాడకూడదు. ఇది చర్మాన్ని మరింత దెబ్బతీస్తుంది. తీవ్రమైన దురద, మంట, కనురెప్పల వాపు ఉంటే డెర్మటాలజిస్ట్ లేదా కంటి వైద్యుడిని సంప్రదిస్తే వారు ఐవర్‌మెక్టిన్ లేదా ప్రత్యేక ఆయింట్మెంట్లను సూచిస్తారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
