Hormonal Imbalance : మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతతోనే అధిక బరువు సమస్య..
సాక్షి లైఫ్ : నేటి ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో 'అధిక బరువు' ఒకటి. బరువు పెరగగానే అందరూ మొదట అనుకునేది.. తాము ఎక్కువగా తినడం వల్లే లావవుతున్నామని..! కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. చక్కటి సమతుల్య ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ చాలామంది బరువు పెరుగుతుంటారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, అంతర్గత ఆరోగ్య సమస్యలు శరీర జీవక్రియలను (metabolism) దెబ్బతీసి బరువు పెరిగేలా చేస్తున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే, బరువు పెరగడానికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
1. హార్మోన్ల లోపం..
శరీరంలో హార్మోన్ల సమతుల్యత లోపించినప్పుడు జీవక్రియ మందగించి, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది.
ముఖ్య కారణాలు..
థైరాయిడ్ లోపాలు అంటే హైపోథైరాయిడిజం, మహిళల్లో వచ్చే పీసీఓఎస్ (PCOS - పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు బరువు పెరగడానికి ప్రధాన కారణాలు.
ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో అకస్మాత్తుగా బరువు పెరగడం సర్వసాధారణం. బరువు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి హార్మోన్ల పరీక్షలు చేయించుకోవాలి.
2. నిద్ర కరవైతే.. ఆకలి ఎక్కువ..
ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతిరోజూ పెద్దలకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్ర సరిపోనప్పుడు ఆకలిని ప్రేరేపించే 'గ్రెలిన్' (Ghrelin) హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో కడుపు నిండినట్లు సూచించే 'లెప్టిన్' (Leptin) హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా, నిద్రలేమితో బాధపడేవారు తెలియకుండానే అతిగా తింటూ బరువు పెరుగుతుంటారు. నిరంతర నిద్రలేమి శరీర జీవక్రియను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
3. ఒత్తిడి.. పొత్తికడుపున కొవ్వు..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన నిత్యకృత్యంగా మారాయి. ఒక వ్యక్తి సుదీర్ఘకాలం పాటు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, శరీరంలో 'కార్టిసాల్' (Cortisol) అనే హార్మోన్ విడుదల పెరుగుతుంది. ఈ హార్మోన్ ఆకలిని పెంచడమే కాకుండా, శరీరంలో ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు నిల్వలు పెరిగేలా చేస్తుంది. చాలామంది ఒత్తిడిలో ఉన్నప్పుడు స్వీట్లు, జంక్ ఫుడ్, అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు మానసిక ప్రశాంతతపై కూడా దృష్టి పెట్టాలి.
4. గంటల తరబడి కూర్చోవడం..
ఆధునిక జీవనశైలిలో ఆఫీసు పనులు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. రోజంతా కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరం తక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. వినియోగించని అదనపు కేలరీలన్నీ క్రమంగా శరీరంలో కొవ్వుగా మారుతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా ఏదైనా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
5. మందుల దుష్ప్రభావాలు..
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కోసం వాడే మందులు కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. డిప్రెషన్ తగ్గడానికి వాడే యాంటీడిప్రెసెంట్స్, స్టెరాయిడ్స్, హార్మోన్ల మందులు, అలాగే కొన్ని రకాల రక్తపోటు (bp), మధుమేహం (sugar) మందుల వల్ల దుష్ప్రభావంగా బరువు పెరుగుతారు. ఈ మందులు శరీర జీవక్రియను, ఆకలిని, బాడీలోని నీటి సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఏదైనా కొత్త మందులు వాడటం ప్రారంభించిన తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగితే, వెంటనే వైద్యుడికి తెలపాలి. అంతే తప్ప వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మాత్రం అస్సలు ఆపకూడదు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
