COVID-19 New Variant ‘PJ.2.1 : కరోనా కొత్త వేరియంట్ ‘పీజే.2.1’ కలకలం.. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందా..?
సాక్షి లైఫ్ : మహమ్మారి కరోనా వైరస్ మరోసారి పలు దేశాల్లో పంజా విసురుతోంది..గత ఏడాది కాలంగా కొవిడ్-19 (coronavirus) వ్యాప్తి దాదాపు తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. సార్స్-కోవ్-2 (SARS-CoV-2) వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త మ్యూటేషన్లతో మళ్లీ వెలుగులోకి వస్తోంది. తాజాగా ‘పీజే.2.1’ (PJ.2.1) అనే కొత్త వేరియంట్ ఇప్పటివరకు దాదాపు 18 దేశాల్లో విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో ఏకంగా 24 మ్యూటేషన్లు (genetic changes) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ కొత్త రకం వైరస్ వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి..? దీని నుంచి రక్షణ పొందడానికి మళ్లీ కొత్తగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలపై తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
కణాల్లోకి సులువుగా ప్రవేశించే సామర్థ్యం..!
వైద్య నివేదికల ప్రకారం.. మే 2026 నుంచి ఈ పీజే.2.1 వేరియంట్ వ్యాప్తి మొదలైంది. తొలుత కెనడాలో గుర్తించిన ఈ వేరియంట్, ఆ తర్వాత అమెరికా సహా పలు ఐరోపా దేశాలకు విస్తరించింది. దీని తీవ్రతను అంచనా వేయడానికి జర్మనీలోని ‘లైబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రైమేట్ రీసెర్చ్’ శాస్త్రవేత్తలు మార్కస్ హాఫ్మన్, స్టీఫెన్ పోల్మన్ నేతృత్వంలో ఒక అధ్యయనం నిర్వహించారు.
అధ్యయనంలోని ముఖ్యాంశాలు..
మానవ శరీర కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించడానికి ‘ACE2 రిసెప్టర్’ ఒక ద్వారంలా పనిచేస్తుంది. గత వేరియంట్లతో పోలిస్తే, పీజే.2.1 ఈ రిసెప్టర్‌తో మరింత బలంగా అతుక్కోగలదని (Bind) పరిశోధకులు గుర్తించారు.
అంతేకాకుండా, ACE2 రిసెప్టర్లు చాలా తక్కువగా ఉండే కణాల్లోకి కూడా ఇది అత్యంత సమర్థవంతంగా చొచ్చుకుపోతోంది. దీనివల్ల వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మళ్లీ వ్యాక్సిన్ అవసరమా..? నిపుణుల భరోసా..!
కొత్త వేరియంట్లో ఇన్ని మార్పులు ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ల విషయంలో శాస్త్రవేత్తలు ఒక ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న బూస్టర్ వ్యాక్సిన్ల (ముఖ్యంగా XFG వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన టీకాలు) ద్వారా శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు, ఈ కొత్త పీజే.2.1 వేరియంట్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ప్రయోగాల్లో తేలింది. అంటే, ఇప్పటికే టీకాలు తీసుకున్న వారికి ఈ కొత్త వేరియంట్ నుంచి తగినంత రక్షణ లభిస్తోంది.
అయితే, భవిష్యత్తులో ఈ వైరస్‌లో మరిన్ని కొత్త మ్యూటేషన్లు జరిగి, రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే శక్తిని సంతరించుకుంటే పరిస్థితి మారవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాల్లో ఏమైనా మార్పులున్నాయా..?
ప్రస్తుతం కెనడా, అమెరికా, స్పెయిన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది అన్ని వయసుల వారికీ సోకుతున్నప్పటికీ, దీనివల్ల వ్యాధి తీవ్రత పెరిగినట్లు గానీ, కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్లు గానీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు.
సాధారణ లక్షణాలు..గత వేరియంట్ల తరహాలోనే జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి.
ఎవరికి ముప్పు ఎక్కువ..? సాధారణ ఆరోగ్యవంతుల్లో దీని ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక వ్యాధులు (మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు) ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి.
పీజే.2.1 వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉన్నందున, కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యం వీడాలి. రద్దీ ప్రదేశాల్లో మాస్కు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం, జ్వరం లేదా దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
