ADHD Medication : పెరిగిన ఏడీహెచ్‌డీ మందుల వాడకం.. గుండె ఆరోగ్యానికి ముప్పు తప్పదా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దృష్టి కేంద్రీకరించడంలో లోపం, అతి చంచలత్వం వంటి లక్షణాలతో కూడిన ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్’ Attention Deficit Hyperactivity Disorder (ADHD) బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. ఈ న్యూరో-డెవలప్‌మెంటల్ సమస్యపై అవగాహన పెరగడంతో చాలామంది వైద్యులను ఆశ్రయించి మందులు వాడుతున్నారు. అయితే, ఈ చికిత్సలో వాడే ‘స్టిమ్యులెంట్’ (stimulant drugs) ఔషధాల వినియోగం పెరగడం, వాటితో ముడిపడి ఉన్న తీవ్రమైన దుష్ప్రభావాలు.. ముఖ్యంగా గుండె సంబంధిత ముప్పులపై అంతర్జాతీయ వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

బ్రిటన్‌లో వెల్లడైన తాజా గణాంకాల ప్రకారం.. 

కేవలం మూడు నెలల్లోనే ఏప్రిల్ - జూన్ దాదాపు 3.95 లక్షల మందికి పైగా రోగులకు ఏడీహెచ్‌డీ మందులు రాశారు. ఏడాది వ్యవధిలోనే ఈ ఔషధాల ప్రిస్క్రిప్షన్లలో 40 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ఈ ఔషధాలు వాడేవారి సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరగడం గమనార్హం.

భారత్‌లోనూ పెరుగుతున్న బాధితులు..

ఏకాగ్రత నిలవకపోవడం, పనులను పూర్తి చేయలేకపోవడం, సూచనలను పాటించడంలో తడబడటం, విపరీతమైన మతిమరుపు వంటివి ఏడీహెచ్‌డీ ప్రధాన లక్షణాలు.భారత్‌లో 1.6 శాతం నుంచి 17.9 శాతం వరకు పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లు వివిధ అధ్యయ నాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత దీనికి సంబంధించిన కేసులు, గుర్తింపు ప్రక్రియ దేశంలో మరింత ఊపందు కుంది. మహారాష్ట్రలో ఈ సమస్య ప్రాబల్యం దాదాపు 1.5 శాతంగా ఉండగా, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇది 14 శాతానికి పైగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

అవగాహన మంచిదే.. కానీ ‘ఓవర్ మెడికేషన్’ ప్రమాదకరం..!

సోషల్ మీడియా ద్వారా ఈ రుగ్మతపై ప్రజల్లో చైతన్యం పెరగడం సానుకూల పరిణామమే అయినా, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సాధారణ ఒత్తిడి, మానసిక అలసట, చంచలత్వాన్ని కూడా వ్యాధిగా భ్రమపడే ‘మెడికలైజేషన్ ఆఫ్ డిస్ట్రెస్’ ధోరణి పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి చిన్న సమస్యకు ఔషధ చికిత్సపై ఆధారపడే ధోరణి ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేస్తున్నారు.

గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

మెదడు పనితీరును, ఏకాగ్రతను సమన్వయం చేసేందుకు వాడే స్టిమ్యులెంట్ ఔషధాలు రక్తనాళాలు, గుండె స్పందనలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందు నుంచే స్వల్ప గుండె సమస్యలు ఉన్నవారిలో ఈ మందులు ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.

సడెన్ అరిథ్మిక్ డెత్ సిండ్రోమ్ (SADS)..

ఈ మందుల మోతాదు పెరిగినప్పుడు గుండె కొట్టుకునే లయ అకస్మాత్తుగా తప్పి, ఆకస్మిక గుండెపోటు లేదా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. లండన్‌లో 28 ఏళ్ల యువకుడు డోసేజ్ పెంచిన అనతికాలంలోనే సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించిన ఘటన ఈ ఆందోళనలను మరింత బలపరిచింది.

ముందస్తు పరీక్షలు తప్పనిసరి..

ఏడీహెచ్‌డీ నిర్ధారణ అయిన వెంటనే మందులు ప్రారంభించడానికి ముందు రోగి గుండె పనితీరు, రక్తపోటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరీక్షించాలి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా డోస్ పెంచుకోవడం లేదా తగ్గించడం ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానసిక ప్రవర్తనా థెరపీలు (Behavioral Therapy), జీవనశైలి మార్పులకు ప్రాధాన్యతనిస్తూ, తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే వైద్యుల సమగ్ర పర్యవేక్షణలో మందులు వాడటం సురక్షితమైన మార్గం.

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.