Cough effect : సాధారణ దగ్గే అనుకున్నారు.. కానీ ఆ చిన్నారి ప్రాణం తీసింది..! తల్లిదండ్రులకు వైద్యుల హెచ్చరిక
సాక్షి లైఫ్ : పిల్లలకు దగ్గు, జలుబు రావడం సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడల్లా ఈ సమస్యలు వేధిస్తుంటాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అయితే, మందులు వాడినా రోజుల తరబడి దగ్గు తగ్గకపోతే మాత్రం దాన్ని సాధారణ సమస్యగా కొట్టిపారేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం కొన్నిసార్లు ప్రాణాంతకమైన గుండె జబ్బులకు సంకేతం కావొచ్చని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి 'పెన్నీ డన్' ఉదంతం దీనికి ఒక బాధాకరమైన ఉదాహరణ. అసలు ఆ చిన్నారికి ఏమైంది..? తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం..
అసలేం జరిగింది అంటే..?
బ్రిటన్‌కు చెందిన పెన్నీ చాలా చురుకైన, ఆరోగ్యకరమైన మూడేళ్ల చిన్నారి. గత ఏడాది డిసెంబర్ లో ఆమెకు అకస్మాత్తుగా దగ్గు మొదలైంది. వాతావరణ మార్పుల వల్లే అని భావించిన తల్లిదండ్రులు.. వైద్యుల సలహాతో ఇన్హేలర్లు, సాధారణ మందులు వాడారు. కానీ నెలలు గడుస్తున్నా దగ్గు తగ్గకపోగా, ఆయాసం పెరగడం మొదలైంది. కొద్దిగ మెట్లు ఎక్కినా పాప ఆయాసంతో ఇబ్బంది పడేది. వేసవి వచ్చేసరికి పరిస్థితి విషమించి దగ్గుతో పాటు వాంతులు, విపరీతమైన నీరసం ఆవరించాయి. జూన్ నెలాఖరులో స్కూల్లో ఆడుకుంటుండగా చిన్నారికి ఒక్కసారిగా ఫిట్స్ (seizure) వచ్చాయి.
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ప్రాణం తీసిన 'డైలేటెడ్ కార్డియోమయోపతి'..
హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆ పాప సాధారణ ఇన్ఫెక్షన్తో బాధ పడటం లేదు.. ఆమెకు 'డైలేటెడ్ కార్డియోమయోపతి' (Dilated Cardiomyopathy DCM) అనే ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారించారు.
ఏమిటీ వ్యాధి..?
ఇది గుండె కండరాలను బలహీనపరిచే వ్యాధి. దీనివల్ల గుండె సైజు అసాధారణంగా పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని వివిధ అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయడంలో గుండె విఫలమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 250 మందిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తున్నప్పటికీ, చిన్న పిల్లల్లో వస్తే మాత్రం చాలా ప్రమాదకరం. జన్యుపరమైన లోపాలు లేదా తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు.
చివరకు ఏమైంది..?
చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఆమెను అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్‌పై ఉంచి శస్త్రచికిత్స (operation) చేశారు. గుండె స్పందనలను సాధారణ స్థితికి తీసుకురావడంలో వైద్యులు సఫలమయ్యారు. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గుండె పంపింగ్ సామర్థ్యం పడిపోవడం వల్ల, అప్పటికే పాప మెదడుకు, ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి అవి పనిచేయడం మానేశాయి. గుండె మార్పిడి (Heart transplant) చేద్దామన్నా చిన్నారి శరీరం సహకరించే స్థితిలో లేదు. దీంతో భరించలేని బాధతో ఆ తల్లిదండ్రులు జులై 6న లైఫ్ సపోర్ట్ తొలగించడానికి అంగీకరించారు.
తల్లిదండ్రులకు వైద్యుల సూచనలు..
పిల్లల ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మందులు వాడుతున్నా వారాల తరబడి దగ్గు తగ్గకపోవడం. చిన్న చిన్న పనులు చేసినా, మెట్లు ఎక్కినా విపరీతంగా ఆయాసపడటం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
ఎప్పుడూ చురుకుగా ఉండే పిల్లలు అకస్మాత్తుగా నీరసించిపోవడం, ఆటలపై ఆసక్తి చూపకపోవడం.దగ్గుతో పాటు వాంతులు అవ్వడం, ఏమీ తినకపోవడం."పిల్లలకు వచ్చే ప్రతి చిన్న సమస్యా వాతావరణ మార్పుల వల్లే అని నిర్లక్ష్యం చేయకండి. లక్షణాలు తీవ్రంగా ఉంటే లోతైన వైద్య పరీక్షలు చేయించడం ఉత్తమం" అని బాధిత చిన్నారి తల్లి ఇతర తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
