Pollution Effect : కాలుష్యంతో.. ఆరోగ్యం, జేబు గుల్ల : బీమా క్లెయిమ్స్‌లో భారీ పెరుగుదల..
సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. నవంబర్ 15వ తేదీన ఢిల్లీ వాయు నాణ్యతా సూచీ (Air Quality Index) 384కి పడిపోయి అత్యంత ప్రమాదకర పరిస్థితులను సూచించింది. గాలిలో సూక్ష్మ రేణువులు (PM 2.5) 262 మైక్రోగ్రాములకు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం కారణంగా కేవలం ఊపిరితిత్తులే కాదు.. గుండె జబ్బులు కూడా పెరిగిపోయి ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య, తద్వారా ఆరోగ్య బీమా క్లెయిమ్స్ భారీగా పెరుగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
మూడేళ్లలో 4.3 రెట్లు పెరిగిన క్లెయిమ్స్..
కలుషిత గాలి కారణంగా వచ్చే వ్యాధుల వైద్య ఖర్చుల కోసం చేసే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ గడిచిన మూడేళ్లలో 4.3 రెట్లు పెరిగాయని ఆన్లైన్ ఇన్సూరెన్స్ వేదిక 'పాలసీబజార్' వెల్లడించింది. విస్తుగొలిపే వాస్తవం ఏమిటంటే, ఈ క్లెయిమ్స్‌లో 78 శాతం గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులవే కావడం గమనార్హం. మొత్తం క్లెయిమ్స్‌లో 31 నుంచి 55 ఏళ్ల వయసున్న మధ్య వయస్కులు, ఉద్యోగుల వాటాయే అత్యధికంగా 59 శాతం ఉంది.
60 ఏళ్లు పైబడిన వృద్ధుల క్లెయిమ్స్ 31 శాతంగా ఉన్నాయి. 21 నుంచి 30 ఏళ్ల యువత 6.7 శాతం, 20 ఏళ్ల లోపు పిల్లలు 3.7 శాతం మేర క్లెయిమ్స్ చేశారు. దీనిని బట్టి, వాయు కాలుష్యం ప్రభావం అధిక శాతం 90 శాతం వరకు పనిచేసే వయసున్న వారు, వృద్ధుల పైనే పడుతోందని స్పష్టమవుతోంది.
చిన్న నగరాలకు కూడా పాకిన ముప్పు..
కాలుష్యం కారణంగా అత్యధికంగా ఆరోగ్య బీమా క్లెయిమ్స్ నమోదైన నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో (8,093 claims) నిలిచింది. ఆ తర్వాత పుణె, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. అయితే, కాలుష్య ముప్పు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని నివేదిక తేల్చింది. టైర్-2, టైర్-3 నగరాల చిన్న, మధ్య తరహా నగరాలు వాటా కూడా మొత్తం క్లెయిమ్స్‌లో 55 శాతంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
చలికాలంలోనే అధికం..
వాతావరణ మార్పుల ప్రకారం చూస్తే, కాలుష్యం కారణంగా ఆసుపత్రుల పాలయ్యే వారి సంఖ్య సంవత్సరమంతా ఒకేలా ఉండటం లేదు. అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో గాలి నాణ్యత పడిపోవడం వల్ల క్లెయిమ్స్ అధికంగా నమోదవుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కేవలం ఈ ఆరు నెలల కాలంలోనే 56 శాతం నమోదు కావడం గమనార్హం.
రూ. 241.6 కోట్ల మేర చెల్లింపులు..
కాలుష్య నగరాల్లో నివసిస్తున్న వారిలో 48 శాతం మంది ఇప్పుడు అత్యధిక కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఎంచుకుంటు న్నారని రిపోర్టు తెలిపింది. కాలుష్య సంబంధిత వ్యాధులకు బీమా సంస్థలు చేసిన చెల్లింపులు సైతం గణనీయంగా పెరిగాయి. గత మూడేళ్లలో బీమా చెల్లింపులు 4.5 రెట్లు పెరిగి రూ.241.6 కోట్లకు చేరుకున్నాయి. ఒక్కో క్లెయిమ్‌కు సగటున రూ.62,662 చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
క్లెయిమ్స్ అయిన వ్యాధుల్లో అత్యధికంగా 43.5 శాతం గుండె సంబంధిత (cardiovascular diseases) వ్యాధులు ఉండగా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 35 శాతం, న్యుమోనియా 11.2 శాతం, బ్రోన్కైటిస్ 6 శాతం ఉన్నాయి. కాలుష్యం కేవలం ఆరోగ్యానికే కాకుండా ఆర్థిక పరిస్థితికి కూడా పెను ముప్పుగా మారుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
