Concentration in Children : పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చిన్నవాళ్ళైనా.. పెద్దవాళ్ళైనా.. ఏపని చేసేటప్పుడైనా ఏకాగ్రత చాలా అవసరం. ముఖ్యంగా చదువు విషయంలో పిల్లలు పుస్తకం పట్టుకోగానే బోర్ ఫీల్ అవుతుంటారు. చిన్న శబ్దానికే వాళ్ల దృష్టి మళ్లుతూఉంటుంది. ఇది ప్రస్తుత రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్యే. పిల్లల వయసు, నిద్ర, తీసుకునే ఆహారం, చుట్టుపక్కల వాతావరణం వారి ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే, ప్రతిసారీ వాళ్లను మందలించే బదులు వారి దినచర్యలో, చదివే విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అవేంటో చూద్దాం..

1. సమయాన్ని విభజించాలి..

పిల్లలు గంటల తరబడి ఒకే దగ్గర కూర్చుని చదవలేరు. కాబట్టి, చదువుకునే సమయాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించాలి. ఉదాహరణకు ఓ 20 నుంచి 25 నిమిషాలు చదివిన తర్వాత ఓ ఐదు నిమిషాలు విరామం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల చదువు పట్ల వారికి విసుగు రాదు. రానురాను వారి ఆసక్తిని, సామర్థ్యాన్ని బట్టి చదివే సమయాన్ని పెంచుకోవచ్చు.

2. ప్రశాంతమైన వాతావరణం.. 

టీవీలు, మొబైల్ ఫోన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే చోట పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. అందుకే వారు చదువుకోవడానికి ఒక ప్రశాంతమైన గదిని ఎంచుకోవాలి. స్టడీ టేబుల్ మీద అనవసరమైన వస్తువులు లేకుండా, కేవలం పుస్తకాలు, పెన్నులు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వారి దృష్టి పక్కకి మళ్లకుండా ఉంటుంది.

3. కంటినిండా నిద్ర..

పిల్లలు చురుగ్గా ఉండాలన్నా, ఏకాగ్రతతో చదవాలన్నా తగినంత నిద్ర చాలా అవసరం. రోజూ ఒకే సమయానికి పడుకుని, ఉదయాన్నే లేచేలా అలవాటు చేయాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు టీవీలు, మొబైల్స్ కు వారిని దూరంగా ఉంచాలి. పగటిపూట పిల్లలు నీరసంగా ఉంటున్నారంటే వారి నిద్రలేమి సమస్యపై దృష్టి పెట్టాలి.

4. ఆటలకు ప్రాధాన్యం..

రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టించడం కాకుండా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. సైకిల్ తొక్కడం, పరుగెత్తడం లాంటి ఆటల వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా యాక్టివ్ గా ఉంటారు. చదువుతో పాటు ఆటలకు కూడా సమప్రాధాన్యం ఇవ్వాలి. కదలకుండా కూర్చోబెట్టడం కంటే, మధ్యమధ్యలో చిన్నపాటి శారీరక శ్రమ పిల్లల మెదడు చురుకుదనానికి దోహదపడుతుంది.

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

5. వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి..

కేవలం పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వచ్చినప్పుడే కాకుండా, వాళ్లు చదవడానికి చూపే ఆసక్తిని, చేసే ప్రయత్నాన్ని గుర్తించి అభినందించాలి. ఇలాంటి సానుకూల ప్రోత్సాహం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువును ఏదో ఒత్తిడిలా కాకుండా ఒక మంచి వ్యాపకంగా ఆస్వాదిస్తారు.

నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి..?

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. పిల్లలు చదువులో, ఆటల్లో కనీస ఏకాగ్రత చూపలేకపోతుంటే, చెప్పిన విషయాలను పదే పదే మర్చిపోతుంటే, స్కూల్‌లో సైతం పదే పదే ఫిర్యాదులు వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా వెంటనే ఉపాధ్యాయులతో పాటు పీడియాట్రీషియన్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.