Stress less Life : 20 సెకన్ల విరామంతో ఒత్తిడికి చెక్..! ఇవిగో టిప్స్..
సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితం, నిరంతర పనిభారం వల్ల చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు రోజూ 30 నిమిషాలైనా యోగా, ధ్యానం చేయాలని వైద్యులు చెబుతుంటారు. కానీ, ఆ కాస్త సమయం కూడా కేటాయించలేక సతమతమయ్యేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కోసం కొన్ని 'మైక్రో ప్రాక్టీసెస్' అద్భుతంగా పనిచేస్తాయని బీబీసీ హెల్త్ రిపోర్ట్, పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి తీవ్రమైన సమస్యలకు చికిత్స కాకపోయినప్పటికీ.. కేవలం 20 నుంచి 30 సెకన్ల పాటు చేసే ఈ చిన్నపాటి విరామాలు మెదడుకు, శరీరానికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
1. 30 సెకన్ల 'నవ్వుల యోగా' ..దీని కోసం ఏదైనా జోక్ వినాల్సిన లేదా ఫన్నీ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మనకు మనమే కావాలని నవ్వడం మొదలుపెట్టాలి. ప్రారంభంలో కాస్త వింతగా అనిపించినా, నెమ్మదిగా అది నిజమైన నవ్వుగా మారుతుంది.
ఎలా చేయాలి మరి..?
మూడుసార్లు దీర్ఘంగా గాలి పీల్చుకుని, పొట్టపై చేయి వేసి 'హీ..హీ.. హా..హా..' అంటూ మెల్లగా నవ్వడం ప్రారంభించండి. నెమ్మదిగా నవ్వును పెంచండి. ఒక 30 సెకన్ల తర్వాత గాలి పీల్చుకుని, మీకు సంతోషం కలిగించే ఒక విషయం గురించి ఆలోచించండి. ఇలా చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయని నెదర్లాండ్స్‌కు చెందిన డెల్ఫ్ట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
2. 15 సెకన్ల 'మైక్రో యోగా'..
కంప్యూటర్లు, మొబైల్స్ ముందు గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చునే వారికి మెడ, భుజాలు, వీపు భాగాల్లో తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలాంటి వారు ప్రతి 15 నిమిషాలకోసారి ఒక 15 సెకన్ల పాటు చిన్న స్ట్రెచింగ్ చేయడం వల్ల పనితీరు 15 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా చేయాలి మరి..?
కూర్చున్న చోటే మీ చేతులను వెనక్కి పోనిచ్చి రెండు చేతుల వేళ్లను కలపండి. గాలి పీల్చుకుంటూ చేతులను కిందికి లాగుతూ, ఛాతీని కాస్త పైకి ఎత్తండి. గాలి వదులుతూ శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురండి. ఇలా రెండు మూడు సార్లు చేయండి. ఏదైనా గాయం, నొప్పులు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.
3. కేవలం మూడు దీర్ఘ శ్వాసలు..
మనసు ఆందోళనగా, ఏకాగ్రత లోపించినట్లుగా అనిపించినప్పుడు నెమ్మదిగా తీసుకునే శ్వాసలు మన నరాల వ్యవస్థను శాంతపరు స్తాయి. దీనివల్ల మెదడు విశ్రాంతి స్థితికి చేరుకుంటుందని ఇటలీకి చెందిన పరిశోధకులు తెలిపారు. ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ కు ముందు దీన్ని ప్రయత్నించవచ్చు.
ఎలా చేయాలి మరి..?
ప్రశాంతంగా కూర్చుని కళ్లు మూసుకోండి. నెమ్మదిగా, లోతుగా గాలి పీల్చుకుని వదలండి. ఒక్కో శ్వాసకు కనీసం 10 సెకన్లు సమయం తీసుకోండి. గాలి పీల్చుకున్న సమయం కంటే, వదిలే సమయం కాస్త ఎక్కువగా ఉండాలి. మొత్తం మీ దృష్టి శ్వాస మీదే పెట్టండి. ఇలా మూడుసార్లు చేయాలి.
4. 20 సెకన్ల 'సెల్ఫ్-సూతింగ్ టచ్'..
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరుల సానుభూతిని కోరుకుంటాం, కానీ మనకు మనం ధైర్యం చెప్పుకోవడం మర్చిపోతాం. ఇలా మనపై మనం సానుభూతి చూపించుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ (cortisol) స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎలా చేయాలి..?
మీ రెండు చేతులను గుండె లేదా పొట్టపై ఉంచుకోండి. మీ చేతుల వెచ్చదనాన్ని, స్పర్శను ఆస్వాదిస్తూ నెమ్మదిగా గాలి పీల్చుకోండి. మీ గురించి మీరు పాజిటివ్ మాటలు అనుకోండి..ఉదాహరణకు.. అంతా సర్దుకుంటుంది, నేనిది చేయగలను.. ఇలాంటివి.
5. పనుల మధ్యలోనే 'మైండ్‌ఫుల్ బ్రేక్'..
ధ్యానం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోయినా, రోజువారీ పనుల్లో భాగంగానే ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నడుస్తున్నప్పుడు మీ అడుగుల మీద, పాత్రలు తోముతున్నప్పుడు మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇలాంటి చిన్నపాటి అలవాట్లు రోజంతా పేరుకుపోయే ఒత్తిడిని దరిచేరనివ్వవు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
