Happy Hormones : మనసుకు నచ్చే 'హ్యాపీ హార్మోన్లు'..ఇవి పెరిగితే ఒత్తిడి మాయం..!

షేర్ చేయండి:
Happy Hormones : మనసుకు నచ్చే 'హ్యాపీ హార్మోన్లు'..ఇవి పెరిగితే ఒత్తిడి మాయం..!

సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితం.. ఆఫీసు టెన్షన్లు.. ఇంటి బాధ్యతలు.. వెరసి నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ మానసిక అలసట, ఆందోళన (Anxiety) వెంటాడుతున్నాయి. ఒకే రోజులో మనిషి మూడ్ రకరకాలుగా మారిపోతుంటుంది. ఒకసారి ఎంతో ఉత్సాహంగా, మరోసారి ప్రశాంతంగా, ఇంకోసారి తెలియని నిరాశతో ఉండటానికి బాహ్య పరిస్థితులే కారణమని చాలామంది భావిస్తారు. కానీ, మన సంతోషాన్ని, ఉల్లాసాన్ని శాసించేది బాహ్య ప్రపంచం కాదు.. మన శరీరం లోపల విడుదలయ్యే కొన్ని రసాయనాలే అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటినే 'హ్యాపీ హార్మోన్లు' (Happy Hormones) అంటారు. హార్వర్డ్ హెల్త్ నివేదిక ప్రకారం..మనల్ని నిరంతరం సంతోషంగా ఉంచే మూడు ముఖ్యమైన హార్మోన్ల విధులు, వాటి మధ్య తేడాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

1. సెరోటోనిన్ (Serotonin)..

 ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్..ఇది మనసుకు శాంతిని, సమతుల్యతను ఇచ్చే అద్భుతమైన హార్మోన్. ఇది మనల్ని అంతర్గతంగా తృప్తిగా ఉంచేలా చేస్తుంది.

ఎక్కడ ఉత్పత్తి అవుతుంది..? ఇది మెదడుతో పాటు ప్రధానంగా మన జీర్ణాశయంలో సుమారు 90 నుంచి 95 శాతం వరకూ తయారవుతుంది.

విధులు.. మానసిక స్థితిని చక్కదిద్దడం, మంచి నిద్ర, ఆకలి, జీర్ణక్రియను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఎలా పెంచుకోవాలి మరి..?

ప్రతిరోజూ ఉదయపు సూర్యరశ్మిలో గడపడం, ధ్యానం (Meditation), బాడీ మసాజ్ సమతుల్య ఆహారం ద్వారా దీని స్థాయిలను పెంచు కోవచ్చు. ఇది తగ్గితే చిరాకు, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు వస్తాయి.

2. డోపమైన్ (Dopamine) గెలుపు గుర్రం..!

దీనిని 'ఫీల్ గుడ్' లేదా 'రివార్డ్' హార్మోన్ అని పిలుస్తారు. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు మెదడులో కలిగే అమితానందానికి ఇదే కారణం.

విధులు.. ఇది మనలో ప్రేరణ (Motivation), ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిర్ణయాధికారాన్ని పెంచుతుంది. మనం ఒక పనిలో విజయం సాధించినప్పుడు లేదా ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు ఇది విడుదలై, ఆ పనిని మళ్లీ మళ్లీ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. అలవాట్ల ఏర్పాటులో దీనిదే కీలక పాత్ర.

డోపమైన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..? శరీరంలో డోపమైన్ స్థాయిలు బాగా పడిపోతే పార్కిన్సన్స్ వ్యాధి, ఏకాగ్రత లోపించడం (ADHD) వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.

3. ఎండార్ఫిన్లు (Endorphins)..సహజ నొప్పి నివారిణులు..

వీటిని శరీరపు సొంత పెయిన్ కిల్లర్స్ (Natural Painkillers) అనవచ్చు. ఇవి శారీరక, మానసిక నొప్పులను తగ్గించి ఆహ్లాదాన్ని ఇస్తాయి.

విధులు.. తీవ్రమైన శారీరక శ్రమ లేదా ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇవి శరీరానికి ఇస్తాయి. 'కార్టిసాల్' అనే ఒత్తిడి హార్మోన్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ఎక్కువ దూరం పరుగెత్తిన తర్వాత లేదా వ్యాయామం చేశాక ఒక రకమైన హాయిగా ఉండే అనుభూతి కలుగుతుంది.

ఎలా పెంచుకోవాలి..?

మనసారా నవ్వడం, నృత్యం (Dancing), నడక లేదా పరుగు వంటి వ్యాయామాలు, మనసుకు నచ్చిన సంగీతం వినడం ద్వారా ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. రోజువారీ జీవితంలో కాసేపు వ్యాయామానికి, ధ్యానానికి సమయం కేటాయిస్తూ, నచ్చిన వ్యాపకాలను అలవాటు చేసుకుంటే ఈ మూడు హ్యాపీ హార్మోన్లు సమతుల్యంగా ఉండి.. ఒత్తిడి లేని ఉల్లాస భరితమైన జీవితం మీ సొంతం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.