Masked Depression : పైకి చిరునవ్వు.. లోపల కన్నీళ్లు.. మీరూ 'మాస్క్డ్ డిప్రెషన్'తో బాధపడుతున్నారా..?
సాక్షి లైఫ్ : జీవితంలో అంతా బాగున్నట్లే కనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ మాట్లాడతారు. కానీ ఒంటరి కాగానే చెప్పలేని బాధ, తెలియని శూన్యత మనసును వెంటాడు తుంటాయి. పైకి కనిపించే ఈ ముఖస్తుతి వెనుక దాగి ఉండే మానసిక వేదననే వైద్య పరిభాషలో ముఖానికి నవ్వుల ముసుగు వేసిన కుంగుబాటు (Masked Depression) అంటారు. దీని లక్షణాలు, కారణాలు, పరిష్కారాలపై నిపుణులు చెబుతున్న ముఖ్యమైన అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తహీనత (anemia) ఏర్పడినప్పుడు శరీరం నీరసించిపోవడం, మాట్లాడే శక్తి తగ్గడం ఎంత సహజమో... మెదడులోని రసాయన సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మనసూ అనారోగ్యానికి గురవుతుంది. సాధారణంగా కుంగుబాటు బారిన పడినవారు గదికే పరిమితమై, నిస్తేజంగా ఉంటారని భావిస్తారు. అయితే అధిక పనితీరు కనబరుస్తూ, సామాజికంగా ఎంతో చురుగ్గా కనిపించే వారిలోనూ లోలోపల తీవ్రమైన కుంగుబాటు దాగి ఉండే అవకాశం ఉంది. దీన్నే 'స్మైలింగ్ డిప్రెషన్' అని కూడా పిలుస్తారు.
విజయాల వెనుక తీవ్ర ఒత్తిడి..
ప్రతిభ, అధిక విద్యార్హతలు లేదా పెద్ద ఉద్యోగం ఉన్నంత మాత్రాన మానసిక సమస్యలు రావనేది అపోహ మాత్రమే. ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థుల నుంచి కార్పొరేట్ రంగాల్లో రాణించే యువత వరకు ఈ సమస్య విస్తరిస్తోంది. నిరంతర పోలికలు.. 'ఎల్లప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి' అన్న ఒత్తిడి మెదడును నిరంతరం అలసిపోయేలా చేస్తుంది. బలహీన తలను బయటపెడితే సమాజం ఎక్కడ చులకనగా చూస్తుందోనన్న భయంతో చాలామంది తమ బాధను కప్పిపుచ్చుకుంటారు. ఉన్నత ప్యాకేజీలు, హోదాలే జీవిత పరమావధి అన్న వాతావరణం యువతను తీవ్ర నిరాశలోకి నెడుతోంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గుర్తించదగ్గ ముఖ్య సంకేతాలు..
బాహ్య ప్రపంచానికి నవ్వుతూ కనిపించినా, లోలోపల తీవ్రమైన నిస్సహాయత, శూన్యత అనిపించడం. గతంలో ఇష్టపడిన పనులపై ఆసక్తి తగ్గడం, సన్నిహితులకు దూరంగా ఉండటం. నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం, ఆకలిలో ఆకస్మిక మార్పులు. చిన్నచిన్న విషయాలకే విపరీతమైన అసహనం, కోపం రావడం. ఎడతెగని తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తడం.ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, విపరీతమైన ఆత్మన్యూనతాభావం.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర..
యూనిసెఫ్ (UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం దాదాపు 50 శాతం మానసిక సమస్యలు 14 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభమ వుతాయి. అందుకే పిల్లలపై అతిపెద్ద ఆశలు రుద్దే బదులు, వారికి మానసిక బలాన్ని ఇవ్వడం ముఖ్యం. పిల్లలు 'ఎలాంటి ఫలితాలు సాధించారు' అనేదానికంటే 'ఎలాంటి మంచి మనుషులుగా ఎదుగుతున్నారు' అనేదానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సవాళ్లు జీవితంలో భాగమేనని, ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా తిరిగి నిలబడే నేర్పును నేర్పించాలి. చదువు, ర్యాంకులు దాటి వారి రోజువారీ భావాలు, భయాలను పంచుకునేందుకు ఇంట్లో వెసులుబాటు కల్పించాలి.
సహాయం కోరడం బలహీనత కాదు..!
మానసిక సమస్య అనేది వ్యక్తిగత లోపం కాదు,అది చికిత్స ద్వారా నయమయ్యే ఒక ఆరోగ్య సమస్య మాత్రమే. మనసు బాగోలేనప్పుడు దాన్ని బలవంతంగా దాచే ప్రయత్నం చేయకుండా, 'నాకు సమస్య ఉంది' అని అంగీకరించడమే కోలుకోవడానికి మొదటి అడుగు.
మానసిక నిపుణులు (psychiatrists or counselors) అందించే కౌన్సెలింగ్, అవసరమైతే సూచించే ఔషధాలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ల సమతుల్యతను సరిచేసి ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తాయి. రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర, తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం, అలాగే సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడటం వంటివి ఉపశమనం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
