Sadness vs. Depression : విచారం.. డిప్రెషన్ ఒకటేనా..? ఈ రెంటికీ మధ్య తేడాను ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వైఫల్యాలు లేదా ఆత్మీయులను కోల్పోయినప్పుడు బాధపడటం, విచారంగా ఉండటం సహజం. పరిస్థితులను బట్టి ఈ భావనలు కాలక్రమేణా తగ్గిపోతాయి. కానీ, ఎప్పుడూ ఒకేలాంటి బాధ, నిరాశ వెంటాడుతుంటే, రోజువారీ పనులపై ప్రభావం పడుతుంటే.. అది సాధారణ విచారం కాకపో వచ్చు, దాన్ని డిప్రెషన్ (depression)గా అనుమానించాలి. ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను, డిప్రెషన్ లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

అసలు విచారానికి, డిప్రెషన్‌కు తేడా ఏమిటి..?

సాధారణ విచారం: ఇది ఒక సహజమైన భావోద్వేగం. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు ఇది కలుగుతుంది. ఇలాంటి సమయంలో కూడా మనుషులు తమకు నచ్చిన పనులు చేసినప్పుడు లేదా ఆప్తులతో ఉన్నప్పుడు సంతోషాన్ని పొందగలరు. పరిస్థితులు చక్కబడగానే విచారం దానికదే దూరమవుతుంది.

డిప్రెషన్ (depression).. ఇది ఒక మానసిక రుగ్మత. కనీసం రెండు వారాలకు పైగా నిరంతరంగా విచారంగా ఉండటం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం దీని ప్రధాన లక్షణం. ఇది మనిషి నిద్ర, ఆకలి, ఏకాగ్రత, ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

డిప్రెషన్ ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు తీవ్రమైన శూన్యతను, నిరాశను అనుభవించడం. ఒకప్పుడు ఎంతో ఇష్టపడిన పనులు, వ్యాపకాలపై పూర్తిగా ఆసక్తి కోల్పోవడం. నిద్రలేమితో బాధపడటం లేదా అతిగా నిద్రపోవడం. ఆకలిలో మార్పులు, అకారణంగా బరువు పెరగడం లేదా ఉన్నకళంగా తగ్గడం. ఎప్పుడూ అలసటగా అనిపించడం, శారీరక శక్తి లోపించినట్లు నీరసించిపోవడం. ఏకాగ్రత లోపించడం, చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలోనూ తడబడటం. తనను తాను నిందించుకోవడం, ఎందుకూ పనికిరాని వాడిగా అపరాధ భావనతో కుంగిపోవడం.

ఈ సమస్య ఎందుకు వస్తుంది..?

డిప్రెషన్ రావడానికి నిర్దిష్టమైన కారణం ఒకటే ఉండదు. దీనివెనుక అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి. ఆత్మీయుల మరణం లేదా జీవితంలో ఊహించని పెద్ద ప్రతికూల మార్పులు ఎదురుకావడం. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉండి ఉండటం అంటే జన్యుపరమైన కారణాలు. దీర్ఘకాలిక వ్యాధులు లేదా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు. సమాజానికి దూరంగా ఒంటరిగా గడపడం, మెదడులోని హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడటం. వంటి లక్షణాలు కనీసం రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉండి, ఆఫీసు పనులు, చదువు లేదా కుటుంబ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంటే వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను (psychiatrist or psychologis) సంప్రదించాలి.

ఆలస్యం చేయకుండా..

ముఖ్యంగా, జీవితంపై విరక్తి కలగడం, తనను తాను గాయపరుచు కోవాలనే ఆలోచనలు, ఆత్మహత్య భావనలు వస్తుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులకు లేదా నమ్మకమైన ఆప్తులకు ఆ విషయాన్ని చెప్పి, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. డిప్రెషన్ అనేది బలహీనత కాదు, సరైన చికిత్సతో దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.