For Better Sleep : కంటి నిండా నిద్ర కావాలా..? నిమిషాల్లో నిద్రలోకి జారుకునే '4-7-8' టెక్నిక్ మీకోసమే..!
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో నిద్రలేమి (insomnia) అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మానసిక ఒత్తిడి, ఆందోళన, మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం, అస్తవ్యస్తమైన దినచర్య.. ఇవన్నీ మన నిద్రను దూరం చేస్తున్నాయి. పరుపు మీదకు చేరిన తర్వాత గంటల తరబడి అటూ ఇటూ దొర్లుతున్నా నిద్రపట్టక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. నిద్రలేమి వల్ల శారీరక అలసటతో పాటు మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. అయితే, ఎలాంటి మందులు వాడకుండా, కేవలం 5 నిమిషాల్లో ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేందుకు '4-7-8 శ్వాస పద్ధతి' అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఏమిటీ '4-7-8' శ్వాస పద్ధతి..?
ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆండ్రూ వెయిల్ ప్రాచుర్యంలోకి తెచ్చిన అత్యంత సులభమైన, సమర్థవంతమైన శ్వాస వ్యాయామమే ఈ '4-7-8 టెక్నిక్'. నాడీ వ్యవస్థను శాంతపరిచి, శరీరాన్ని విశ్రాంతి స్థితికి చేర్చడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
ఎలా చేయాలి..?
ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి..
స్టెప్ 1.. ముందుగా మంచం మీద సౌకర్యవంతంగా కూర్చోవడం లేదా పడుకోవాలి.
స్టెప్ 2 (4 సెకన్లు).. మీ నోరు మూసుకుని, ముక్కు ద్వారా నెమ్మదిగా 4 సెకన్ల పాటు గాలిని లోపలికి పీల్చుకోవాలి.
స్టెప్ 3 (7 సెకన్లు).. పీల్చిన గాలిని వదలకుండా, 7 సెకన్ల పాటు అలాగే బిగపట్టి ఉంచాలి.
స్టెప్ 4 (8 సెకన్లు).. ఇప్పుడు మీ నోటి ద్వారా 8 సెకన్ల పాటు గాలిని నెమ్మదిగా, పూర్తిగా బయటకు వదిలేయాలి.
ఈ విధంగా ఒక సైకిల్ పూర్తవుతుంది. ఇలా 4 నుంచి 5 సార్లు ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి.
ఆరోగ్యప్రయోజనాలు అనేకం..
ఈ చిన్న శ్వాస వ్యాయామం ద్వారా శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి.
ఒత్తిడి, ఆందోళన మాయం..
నెమ్మదిగా, నియంత్రణతో శ్వాస తీసుకోవడం వల్ల మెదడులో ఒత్తిడిని పెంచే 'కార్టిసాల్' హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. భయం, మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
మనసుకు ప్రశాంతత..
మన శ్వాసపైనే పూర్తి దృష్టి పెట్టడం వల్ల నెగెటివ్ ఆలోచనలు, అనవసరంగా అతిగా ఆలోచించే ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది.
హృదయ స్పందనల నియంత్రణ..
లోతుగా గాలి పీల్చడం వల్ల శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై, గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
వెంటనే నిద్ర..
నాడీ వ్యవస్థ, మెదడు విశ్రాంతి స్థితిలోకి (Relaxation state) వెళ్లడం వల్ల నిమిషాల్లోనే కంటికి కునుకు పడుతుంది. మంచం మీద అటూ ఇటూ దొర్లే అవసరం ఉండదు.
దీర్ఘకాలిక సమస్యలకు చెక్..
మందుల అవసరం లేకుండా సహజసిద్ధంగా నిద్రను ప్రేరేపించే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే.. దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
