Without Surgery : అయోర్టిక్ స్టెనోసిస్‌ కు.. కోత లేని చికిత్సతో పునర్జన్మ..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసు పెరిగేకొద్దీ కొంచెం నడిచినా ఆయాసం రావడం, త్వరగా అలసిపోవడం సహజమని చాలామంది భావిస్తారు. కానీ, ఈ చిన్న లక్షణాల వెనుక గుండెకు సంబంధించిన పెను ముప్పు దాగి ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే ‘అయోర్టిక్ స్టెనోసిస్’ (Aortic Stenosis). గుండె నుంచి శరీరానికి రక్తాన్ని పంపే ప్రధాన కవాటం.. వాల్వ్ ఇరుకుగా మారడమే ఈ సమస్య. దీనిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం తప్పదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

ఏమిటీ అయోర్టిక్ స్టెనోసిస్..?

గుండెలోని ఎడమ జఠరిక నుంచి రక్తం బయటకు వెళ్లే ద్వారం వద్ద ఉండే ‘అయోర్టిక్ వాల్వ్’ క్యాల్షియం పేరుకుపోవడం వల్ల గట్టిపడి, ఇరుకుగా మారుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

  సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య అధికం. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం, ఛాతిలో నొప్పి లేదా బిగుతుగా ఉండటం, కళ్లు తిరగడం, అకస్మాత్తుగా స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నిశ్శబ్ద మృత్యువులా..

ఈ వ్యాధి చాలా కాలం పాటు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేకుండానే పెరుగుతుంది. అయితే, ఒక్కసారి లక్షణాలు బయటపడిన తర్వాత చికిత్స అందించకపోతే, ఏడాది లేదా రెండేళ్లలోనే 50 శాతం మంది మరణించే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది దీనిని వృద్ధాప్య సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తోంది.

‘టావీ’ (TAVI)తో సరికొత్త చికిత్స.. 
 
గతంలో పాడైపోయిన గుండె వాల్వ్‌ను మార్చాలంటే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ ఒక్కటే మార్గం. కానీ, వయసు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సర్జరీని తట్టుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు టావీ (Transcatheter Aortic Valve Implantation) అనే విప్లవాత్మక చికిత్స అందుబాటులోకి వచ్చింది.

ఈ చికిత్స విషయంలో ఛాతిని కోయాల్సిన అవసరం లేదు. కాలి రక్తనాళం ద్వారా కేథటర్ సాయంతో కొత్త వాల్వ్‌ను గుండెలోకి పంపి అమర్చుతారు. సర్జరీతో పోలిస్తే రక్తస్రావం తక్కువ, ఇన్ఫెక్షన్ ముప్పు ఉండదు. రోగి కేవలం రెండు మూడు రోజుల్లోనే ఇంటికి వెళ్లవచ్చు.

 అలసటను వయసుపై నెట్టేయకండి. స్టెతస్కోప్‌తో గుండె చప్పుడును పరీక్షించడం లేదా చిన్న ‘ఎకో’ (Echo) టెస్ట్ ద్వారా ఈ సమస్యను ప్రారంభంలోనే పసిగట్టవచ్చు. ఆధునిక సాంకేతికతతో ఇప్పుడు 80-90 ఏళ్ల వయసులో కూడా సురక్షితంగా వాల్వ్ మార్పిడి చేసుకుని హాయిగా జీవించవచ్చని ప్రముఖ కార్డియాలజిస్టులు పేర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.