Creatine Supplements : క్రియేటిన్ సప్లిమెంట్స్ వాడితే బట్టతల వస్తుందా..?
సాక్షి లైఫ్ : ఫిట్‌నెస్ ప్రపంచంలో ప్రస్తుతం 'క్రియేటిన్' (Creatine) ఒక సంచలనం. జిమ్‌కు వెళ్లే యువత నుంచి అథ్లెట్ల వరకు చాలామంది కండరాల బలం కోసం దీనిని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇది నిజంగా కండరాలు పెంచడానికి షార్ట్‌కట్ మార్గమేనా..? దీనివల్ల బట్టతల వస్తుందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ అంశంపై అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవాలేంటో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఏమిటీ క్రియేటిన్..?
క్రియేటిన్ అనేది మన శరీరంలో సహజంగా తయారయ్యే ఒక సమ్మేళనం. కాలేయం, మూత్రపిండాలు మరియు క్లోమం.. గ్లైసిన్, ఆర్జినైన్ వంటి అమైనో ఆమ్లాల సహాయంతో దీనిని ఉత్పత్తి చేస్తాయి. మన శరీరంలోని క్రియేటిన్‌లో 95శాతం కండరాలలోనే నిల్వ ఉంటుంది. ఇది కణాలకు అవసరమైన శక్తిని (ATP) అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కండరాలు పెరగడానికి ఇది షార్ట్‌కట్ కాదు..!
చాలామంది క్రియేటిన్ తీసుకోగానే కండరాలు వాటంతట అవే పెరిగిపోతాయని భావిస్తారు. కానీ, ఇది పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రియేటిన్ నేరుగా కండరాలను నిర్మించదు. ఇది వ్యాయామం చేసే సమయంలో కండరాలకు అవసరమైన అదనపు శక్తిని ఇస్తుంది. తద్వారా మీరు ఎక్కువ సేపు, కఠినమైన వ్యాయామాలు చేయగలుగుతారు. ఆ శ్రమ వల్ల మాత్రమే కండరాలు పెరుగుతాయి. సరైన శిక్షణ, పౌష్టికాహారం, తగినంత నిద్ర లేనిదే.. ఏ సప్లిమెంట్ కూడా ఫలితాన్ని ఇవ్వదు" అని వైద్యనిపుణులు అంటున్నారు.
బట్టతల భయం.. వాస్తవమెంత..?
క్రియేటిన్ వాడకం వల్ల జుట్టు రాలిపోతుందని, బట్టతల వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తే.. క్రియేటిన్ వాడకం వల్ల డీహెచ్‌టీ (DHT) అనే హార్మోన్ స్థాయిలు పెరగవచ్చని కొన్ని పాత అధ్యయనాలు పేర్కొన్నాయి. జుట్టు రాలడానికి ఈ హార్మోన్ ఒక కారణం.
అయితే, క్రియేటిన్ నేరుగా బట్టతలకు దారితీస్తుందని నిరూపించ డానికి తగినన్ని శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సాధారణ మోతాదులో తీసుకున్నప్పుడు హార్మోన్ల వ్యవస్థ దెబ్బతింటుందనడానికి కూడా ఆధారాలు లేవని డైటీషియన్లు చెబుతున్నారు.
ఎవరికి ఉపయోగకరం..?
తీవ్రమైన వ్యాయామాలు: స్ప్రింట్లు, వేగంగా చేసే పనులు, బరువైన వ్యాయామాలు చేసే అథ్లెట్లకు ఇది బాగా పనిచేస్తుంది. కండరాలకే కాకుండా, మెదడు పనితీరుకు కూడా క్రియేటిన్ అవసరమని, వృద్ధులలో జ్ఞాపకశక్తి పెరగడానికి ఇది కొంతవరకు దోహదపడొచ్చని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. నడక, సైక్లింగ్ వంటి సుదీర్ఘ ఏరోబిక్ వ్యాయామాలు చేసేవారిపై దీని ప్రభావం చాలా తక్కువ.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
తక్షణ ఫలితాలు ఉండవు.. ఇది ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్లలా (కెఫీన్ వంటివి) వెంటనే శక్తిని ఇవ్వదు. శరీరంలో ఇది పేరుకుపోవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. స్టెరాయిడ్ కాదు..క్రియేటిన్ స్టెరాయిడ్ కాదు. ఇది శరీరానికి హాని చేసే నిషేధిత పదార్థం కాదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా దీనిని వాడకూడదు. క్రియేటిన్ అనేది కేవలం ఒక 'సహకారి' మాత్రమే. కష్టపడి వ్యాయామం చేయకుండా కేవలం సప్లిమెంట్లతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం వృథా అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.