Rosemary Oil : హెయిర్ గ్రోత్ కు రోజ్‌మెరీ ఆయిల్ పనిచేస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?
సాక్షి లైఫ్ : జుట్టు రాలడం అనేది ప్రస్తుత తరంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనికి పరిష్కారంగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వేదికల్లో 'రోజ్‌మెరీ ఆయిల్' (Rosemary Oil) ఒక అద్భుత ఔషధంగా ప్రచారంలో ఉంది. ఇది వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని, బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయని అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌పై శాస్త్రవేత్తలు, చర్మవ్యాధి నిపుణులు (Dermatologists) ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
రోజ్‌మెరీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందనే వాదనకు ఆధారం 2015లో జరిగిన ఒక చిన్నపాటి పరిశోధన. ఇందులో 2శాతం మిన్ ఆక్సిడిల్ (Minoxidil - జుట్టు పెరుగుదలకు వాడే మందు), రోజ్‌మెరీ ఆయిల్‌ను పోల్చారు. ఆరు నెలల తర్వాత రెండింటి ఫలితాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తేలింది. జుట్టు రాలడానికి కారణమయ్యే డిహెచ్‌టి (DHT) హార్మోన్ ప్రభావాన్ని తగ్గించడంలో రోజ్‌మెరీ కొంతవరకు పనిచేస్తుందని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి.
తలకు ఈ నూనెతో మసాజ్ చేసినప్పుడు రక్త ప్రసరణ పెరిగి, కుదుళ్లకు పోషకాలు అందుతాయని నిపుణులు వివరిస్తున్నారు. రోజ్‌మెరీ ఆయిల్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ ఒకేలా పనిచేస్తుందని చెప్పలేమని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. మిన్ ఆక్సిడిల్‌తో పోలిస్తే రోజ్‌మెరీ ఆయిల్‌పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. కాబట్టి దీనిని పూర్తిస్థాయి చికిత్సగా భావించలేము. ఏదైనా సహజ సిద్ధమైన నూనె ఫలితం చూపడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. వారం, పది రోజుల్లో జుట్టు పెరుగుతుందనే ప్రచారంలో నిజం లేదు.
వంశపారంపర్యంగా వచ్చే బట్టతల లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వల్ల జుట్టు ఊడిపోతుంటే.. కేవలం ఈ నూనెతో ఫలితం ఉండదు. దానికి వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సిందే.
ఎలా ఉపయోగించాలి..?
రోజ్‌మెరీ ఆయిల్ నేరుగా తలకు రాయకూడదు ఎందుకంటే..? ఇది ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి చర్మం మండుతుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి వాటిలో కొన్ని చుక్కల రోజ్‌మెరీ ఆయిల్ కలిపి వాడాలి. ప్యాచ్ టెస్ట్ చేయాలి.. ముందుగా చర్మంపై చిన్న భాగంలో రాసి, అలర్జీ లేదని నిర్ధారించుకున్నాకే తలకు పట్టించాలి.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు దీనిని వాడకపోవడమే మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రోజ్‌మెరీ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి మంచిదే కానీ, దీనిని వాడడం వల్ల రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. జుట్టు విపరీతంగా రాలుతున్నట్లయితే, కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా నిపుణులైన వైద్యలని సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
