One Symptom, Many Diseases : ఒకే లక్షణం.. ఎన్నో వ్యాధులు.. అసలు ముప్పును ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తరచూ అలసటగా ఉంటోందా..? తలనొప్పి, కళ్లు తిరగడం లేదా కడుపునొప్పి వేధిస్తున్నాయా..? వీటిని చాలామంది గ్యాస్ ట్రబుల్ అనో, నిద్రలేమి అనో, నీరసం అనో తమకు తామే నిర్ధారణ చేసేసుకుంటారు. కానీ, ఒకే లక్షణం వెనుక అనేక రకాల వ్యాధులు దాగి ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక లక్షణాన్ని చూసి సొంతంగా మందులు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మరి ఒకేలా కనిపించే లక్షణాల వెనుక ఉన్న అసలు వ్యాధులను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

 

1. అలసట, నీరసం (Fatigue & Weakness)..

అలసట అనేది సర్వసాధారణంగా కనిపించే లక్షణం. దీనివల్ల అసలు రోగాన్ని గుర్తించడంలో తరచూ గందరగోళం ఏర్పడుతుంది. సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి లేదా శారీరక శ్రమ వల్ల అలసట రావచ్చు. విశ్రాంతి తీసుకున్నా దీర్ఘకాలం పాటు అలసట వేధిస్తుంటే అది రక్తహీనత (Anemia), మధుమేహం (Diabetes), థైరాయిడ్ లేదా నిద్ర సంబంధిత సమస్యలకు (Sleep Apnea) సంకేతం కావచ్చు. అలసటతో పాటు కారణం లేకుండా బరువు తగ్గడం, తరచూ జ్వరం రావడం, విపరీతంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2. తలనొప్పి (Headache)..

తలనొప్పికి వందలాది కారణాలు ఉండవచ్చు. చాలాసార్లు ఇది సాధారణమైనదే అయినా, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు.
మానసిక ఒత్తిడి, మైగ్రేన్, నిద్రలేమి, డీహైడ్రేషన్ లేదా కళ్లపై ఒత్తిడి పడటం. హఠాత్తుగా, భరించలేనంత తీవ్రంగా వచ్చే తలనొప్పి బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) లేదా బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు.

తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం, గందరగోళం, మూర్ఛ, ముఖం ఒక వైపుకు వంగిపోవడం లేదా మాట తడబడటం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాలి.

3. కళ్లు తిరగడం (Dizziness)..

కళ్లు తిరగగానే చాలామంది ‘నీరసం’ అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, ఇది అనేక ఇతర సమస్యలకు సూచిక. శరీరంలో నీటిశాతం తగ్గడం (Dehydration), లో-బీపీ (Low Blood Pressure) లేదా లోపలి చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల కళ్లు తిరుగుతాయి. కళ్లు తిరగడంతో పాటు ఛాతీ నొప్పి రావడం, శ్వాస ఆడకపోవడం, మాట ముద్దగా రావడం, శరీరంలో ఒకవైపు కండరాలు పట్టు కోల్పోవడం (Weakness) వంటివి కనిపిస్తే దాన్ని సాధారణ నీరసంగా భావించకూడదు.

4. కడుపు నొప్పి (Stomach Ache)..

కడుపు నొప్పి రాగానే ముందుగా గుర్తొచ్చేది గ్యాస్ ట్రబుల్ లేదా అజీర్తి. కానీ, నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి వ్యాధి మారుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి లేదా సాధారణ ఇన్ఫెక్షన్లు. కడుపు కుడివైపు పైభాగంలో నొప్పిగా ఉంటే అది కాలేయం (Liver) లేదా పిత్తాశయ (Gallbladder) సమస్యలకు సంకేతం కావచ్చు. కడుపులో నొప్పి హఠాత్తుగా మొదలై, తీవ్రత పెరుగుతూ ఉంటే.. దాంతో పాటు పదే పదే వాంతులు కావడం, చర్మం పసుపు పచ్చగా మారడం కామెర్లు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

వైద్యులు ఏం చెబుతున్నారు..?

ఏదైనా ఒక వ్యాధిని నిర్ధారించడానికి డాక్టర్లు కేవలం ఒక లక్షణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోరు. రోగికి ఉన్న ఇతర సమస్యలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర (Family History), రక్త పరీక్షలు, స్కానింగ్ రిపోర్టులను విశ్లేషించిన తర్వాతే సరైన చికిత్సను అందిస్తారు. కాబట్టి సొంత వైద్యానికి దూరంగా ఉండటమే ఆరోగ్యానికి రక్ష.

ఇది కూడా చదవండి.. Are You Healthy : ఆరోగ్యం సరైన ట్రాక్‌లోనే ఉందో లేదో ఈ లక్షణాల ద్వారా చెక్ చేసుకోండి.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..  

ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.